నాటి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ 31 వేలు! అప్పట్లో అది సంచలనం లాంటిదే. బీసీల జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడమే గొప్ప అనుకున్న చోట ఏకంగా 30 వేలకు పైగా మెజారిటీ దక్కింది!
కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమి పాలైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తిరిగి విజయం సాధించింది. అయితే ఈ సారి మెజారిటీ 8 వేల చిల్లర. దీనికి కారణాలు ఏమిటంటే.. నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమే. పదివేల లోపు ఓట్ల తేడాతో ఓడిన చాలా నియోజకవర్గాల్లో నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసంతో కోల్పోయింది.
ధర్మవరంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 వేలకుపైగా మెజారిటీ దక్కింది. ఈ సారి బీజేపీ అభ్యర్థి అక్కడ మూడు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. సరిగ్గా ఇన్నే ఓట్లను కాంగ్రెస్ పార్టీ పొందడం గమనార్హం! ధర్మవరంలో కాంగ్రెస్ అభ్యర్థి మూడు వేల ఏడు వందల ఓట్లను పొందితే, సరిగ్గా అంతే మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గెలిచాడు! కేవలం ధర్మవరం విషయంలోనే కాదు పుట్టపర్తిలో కూడా అలాంటిదే జరిగింది. పుట్టపర్తిలో బీఎస్పీ అభ్యర్థికి అటు ఇటుగా నాలుగు వేల ఓట్లు పడ్డాయి!
కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 27 వేల బంపర్ మెజారిటీ దక్కితే టీడీపీకి ఈ సారి మెజారిటీ ఏడు వేలను మించలేదు! అది కూడా అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్ వరస దండయాత్రలు చేస్తూ వచ్చాడు!
మడక శిరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 13 వేల మెజారిటీని సాధిస్తే, టీడీపీ ఈ సారి 351 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేయగలిగింది! ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 17 వేల ఓట్లను సాధించడం గమనార్హం!
రాప్తాడు నియోజకవర్గంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 వేల మెజారిటీ దక్కితే, ఈ సారి టీడీపీ అక్కడ 23 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గింది. ఈ నియోజకవర్గంలోనే పరిస్థితి పూర్తిగా తలకిందుల అయ్యింది. కల్యాణ దుర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి బంపర్ విక్టరీ దక్కింది. 2019లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 వేల మెజారిటీ రాగా, ఈ సారి టీడీపీకి అక్కడ ఏకంగా 37 వేల మెజారిటీ దక్కింది. ఇక్కడ టీడీపీ వైపుకు మెజారిటీనే రెట్టింపు కావడం గమనార్హం.
శింగనమలలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 46 వేల ఓట్ల మెజారిటీని సాధించగా, ఈ సారి టీడీపీ అక్కడ ఆరేడు వేల ఓట్ల తేడా నెగ్గినట్టుగా ఉంది. తాడిపత్రిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఏడు వేల మెజారిటీతో నెగ్గగా, ఈ సారి టీడీపీకి 27 వేల వరకూ మెజారిటీ దక్కింది.
గుంతకల్ లో అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు ఇటుగా 50 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. ఈ సారి తెలుగుదేశం పార్టీ ఏడు వేల లోపు మెజారిటీ తో నెగ్గింది.
కర్నూలు జిల్లాలోకి ఎంటరైతే.. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 వేల స్థాయి మెజారిటీ రాగా, ఈ సారి మూడు వేల లోపు మెజారిటీతో ఆ పార్టీనే నెగ్గింది. ఆదోనిలో 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది వేలకు పైగా మెజారిటీ నెగ్గితే ఈ సారి కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి అక్కడ 18 వేలకుపైగా మెజారిటీతో నెగ్గాడు.
మంత్రాలయంలో 2019 ఎన్నికల్లో 23 వేల మెజారిటీతో నెగ్గిన బాలనాగిరెడ్డి, ఈ సారి 12 వేల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరులో 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 వేల మెజారిటీ దక్కితే, ఈ సారి తెలుగుదేశం పార్టీకి అక్కడ 15 వేల మెజారిటీ వరకూ దక్కింది. కొడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 36 వేలకు పైగా మెజారిటీ దక్కితే, ఈ సారి టీడీపీ అక్కడ 21 వేల వరకూ మెజారిటీ దక్కింది. పత్తికొండలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 వేల మెజారిటీ దక్కితే ఈ సారి టీడీపీ 14 వేల మెజారిటీతో నెగ్గింది.
డోన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుగ్గన 35 వేల మెజారిటీతో నెగ్గారు, 2024 వచ్చే సరికి ఆయనే ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నంద్యాలలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 వేల వరకూ మెజారిటీ వస్తే ఈ సారి టీడీపీకి అక్కడ 12 వేల మెజారిటీ దక్కింది.
పాణ్యంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 వేల మెజారిటీ దక్కితే, ఈ సారి అక్కడ పరిస్థితి రివర్స్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సరిగ్గా అంతే స్థాయి మెజారిటీ దక్కింది! నందికొట్కూరులో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 వేల స్థాయి మెజారిటీ దక్కితే ఈ సారి అక్కడ టీడీపీ తొమ్మిది వేల స్థాయి మెజారిటీతో నెగ్గింది.
శ్రీశైలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 38 వేల మెజారిటీ వస్తే ఈ సారి అక్కడ టీడీపీకి ఏడు వేల లోపు మెజారిటీ దక్కింది. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 35 వేల మెజారిటీ దక్కితే ఈ సారి టీడీపీ అక్కడ 12 వేల మెజారిటీతో నెగ్గింది.
ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 44 వేల మెజారిటీ దక్కితే ఈ సారి టీడీపీకి 22 వేల మెజారిటీ దక్కింది. జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజారిటీ తో నెగ్గితే, 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కూటమి తరఫున బీజేపీకి 17 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. కమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 27 వేల ఓట్ల మెజారిటీ దక్కితే, ఇప్పుడు టీడీపీకి దాదాపు అదే స్థాయి మెజారిటీ దక్కింది.
రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 25 వేలకు పైగా మెజారిటీ వస్తే ఈ సారి అక్కడ టీడీపీ 2500 ఓట్ల స్థాయి మెజారిటీ తో నెగ్గింది. రైల్వే కోడూరులో 34 వేల మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గితే అక్కడ జనసేన అభ్యర్థి ఇప్పుడు 11 వేల మెజారిటీతో నెగ్గాడు. రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 2019 ఎన్నికల్లో 35 వేలకు పైగా మెజారిటీ దక్కితే, ఇప్పుడు టీడీపీ అభ్యర్థికి ఏడు వేల మెజారిటీ దక్కింది!
ఇది రాయలసీమలోని చాలా నియోజకవర్గాల పరిస్థితి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిష్టంగా ఇరవై వేలు, గరిష్టంగా 50 వేల మెజారిటీలు సాధించిన నియోజకవర్గాల్లో.. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి గత రికార్డు స్థాయి మెజారిటీలు కరిగిపోయి తెలుగుదేశం పార్టీకి, దాని మిత్రపక్షాలు బీజేపీ- జనసేనల అభ్యర్థులకు కూడా కనీసం పది వేల లోపు ఓట్ల మెజారిటీలుగా మారాయి.
కారణాలు ఏమిటనేవి పక్కన పెడితే, గెలిచిన టీడీపీ అభ్యర్థులు అయినా, వారి తరఫున విర్రవీగి రచ్చలు చేసుకుంటున్న వారు అయినా కాస్త జాగ్రత్తగా ఉంటే వారికే మంచిది! ప్రజాస్వామ్యంలో వేలకు వేల మెజారిటీలు కూడా కరిగిపోయి అడ్డం తిరుగుతాయి! 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన జోష్ తో పోలిస్తే.. టీడీపీకి ఇప్పుడు సీమలో దక్కిన మెజారిటీలు పదో వంతే! 2019 నాటి మెజారిటీలే ఐదేళ్లకు కరిగిపోయి అడ్రస్ లేకుండా పోయినప్పుడు.. ఇప్పుడు టీడీపీకి దక్కిన మెజారిటీలు చాలా స్వల్పం! కాబట్టి.. తమ్ముళ్లు తత్వం ఎరిగి నడుచుకుంటే మంచిది!
The post అంతటి మెజారిటీలే కరిగిపోయాయి.. తమ్ముళ్లూ జాగ్రత్త! appeared first on Great Andhra.