బుల్లితెర ప్రేక్షకులందరికీ రాకింగ్ రాకేష్ అంటే తెలుసు. మొదట మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చిన రాకేష్ తన కామెడీ అందర్నీ నవ్విస్తూ రాకింగ్ రాకేష్‌గా టీమ్ లీడర్ అయిపోయాడు. తన టీమ్‌తో ఎన్నో షోలు చేసిన రాకేష్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఆమధ్య తను ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి మరో షాక్ ఇచ్చాడు. ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్న రాకేష్ తన సినిమాకి పెట్టిన టైటిల్ ఏమిటంటే.. ‘కెసిఆర్’.
రాకేష్ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమాకి ‘కెసిఆర్’ అనే టైటిల్ పెట్టడం వెనుక రీజన్ ఏమిటో తెలియలేదు. ఈ పోస్టర్‌లో కేసీఆర్ ఫోటో లేకపోయినా షాడోలో మాత్రం కేసీఆర్ లుక్ కనిపిస్తోంది. అయితే కెసిఆర్ అంటే ‘కేశవ్ చంద్ర రమావత్’ అనే అర్థం వస్తుందట. ఈ పోస్టర్‌ను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందించారు. అయితే ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఉంటాయా? లేక సినిమాకి హైప్ రావడం కోసమే కేసీఆర్ అనే టైటిల్ పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక సినిమాను నిర్మిస్తూ, అందులో తనే హీరోగా నటిస్తున్న సినిమాకి ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టి అందర్నీ షాక్‌కి గురి చేసి తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నాడు రాకేష్.