సినిమా వ్యామోహం అనేది చాలా మందికి ఉంటుంది. కానీ, సినిమాల్లో నటించే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. అయితే అందులో కూడా సక్సెస్ అయిన వారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. హీరోయిన్ అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చే కొంతమంది యువతులు మాత్రం కొందరు దుర్మార్గుల చేతిలో ఘోరంగా మోసపోతుంటారు. సినిమా పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ వారి మోసాలను సాగిస్తుంటారు. కొందరు ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను ఆఫీసులకు రప్పించుకొని వారికి మాయ మాటలు చెప్పి లొంగదీసుకుంటారు. అలాంటి ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్.
అనంతపురానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో నివాసం ఉంటోంది. ఐటి కారిడార్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పేరుకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే అయినా ఆమె దృష్టంతా సినిమా రంగంపైనే ఉండేదట. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సిద్ధార్థ్‌వర్మ ఆమెను ట్రాప్ చేశాడు. తనకు అంతకుముందే పరిచయం ఉన్న ఓ అమ్మాయి ద్వారా ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ఆమెతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిరది.
ఆ చనువుతోనే ఆ యువతిని ఓరోజు డిన్నర్‌కి రావాల్సిందిగా తన ఇంటికి ఆహ్వానించాడు వర్మ. డిన్నర్ చేస్తూ సినిమాల గురించి డిస్కస్ చేద్దామని నమ్మబలికాడు. నిజమేననుకొని అతని ఇంటికి వెళ్లింది. సమయం చూసుకొని ఆమె తాగే కూల్‌డ్రిరక్‌లో మత్తు మందు కలిపాడు. స్పృహ తప్పిన ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె వివస్త్రగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. అలా చాలాసార్లు ఆమెను వాడుకున్నాడు. సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి మరికొన్ని సార్లు అత్యాచారం చేశాడు. తను మోసపోయానని గుర్తించడానికి ఆమెకు చాలా కాలం పట్టింది. చివరికి అతనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సిద్ధార్థ్‌వర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు.