ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనితకు మాజీ హోం మంత్రి తానేటి వనిత గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ ని పట్టుకుని ఏక వచన ప్రయోగం చేయడం మీద మండిపడ్డారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే అంటూ అనిత సెటైర్లు వేయడాన్ని తప్పు పట్టారు.
అందరూ ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాతనే పదవులు చేపట్టేది అని అన్నారు. చంద్రబాబు కుప్పానికి ఎమ్మెల్యే కాదా అని ఆమె కౌంటర్ ఇచ్చారు. అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా మరో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి విశేష ప్రజాదరణ ఉన్న జగన్ ని నోటికి ఎంత మాట వస్తే అంత అంటారా అని అనిత మీద విమర్శలు సంధించారు.
ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను అనుకుని అనిత మాట్లాడుతున్నారని మాట్లాడే విషయంలో స్పష్టత ఉండాలని అలాగే సభ్యత పాటించాలని సూచించారు. గత నలభై అయిదు రోజులుగా ఏపీలో జరుగుతున్న మారణ కాండకు అనిత ఏమి జవాబు చెబుతారు అని ప్రశ్నించారు.
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. అనిత వైఖరి చూస్తూంటే పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వనిత అన్నారు. చంద్రబాబు లోకేష్ ల మెప్పు కోసం జగన్ మీద దారుణమైన విమర్శలు చేయవద్దని సూచించారు. పనితీరుని మెరుగుపరుచుకోవాలని కోరారు.
ఏపీలో వైఎస్సార్ విగ్రహాలను ద్వంసం చేయడం నుంచి వైసీపీ కార్యకర్తల మీద హత్యా కాండ సాగించడం వరకూ చూస్తే అసలు వాటి మీద సమీక్ష చేయాలని వనిత కోరారు. తమ పార్టీ వారిని గారు అని సంభోదిస్తూ జగన్ ని మాత్రం ఏకవచనంతో అనిత పిలవడాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. ఆమె విపక్ష నేతలను గౌరవించాలని కోరుతున్నారు.