ఆంధ్రలో ఇసుక ఇప్పుడు ఎలా దొరుకుతోంది. తక్కువగా. ఎక్కువగా.. ఉచిత ఇసుక పథకం వల్ల మంచే జరిగిందా. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతోందా. ఇవీ ప్రశ్నలు. కానీ సమాధానాలే చిత్రంగా వున్నాయి.
ఉచిత ఇసుక పథకం మొదటి రెండు రోజులు బాగానే వుంది. ఆ తరువాతే అసలు సంగతి మొదలయింది. ఇప్పుడు ఒక్క ఇసుక ర్యాంప్ లో కూడా ఇసుక అన్నది లేదు. కారణం ఇసుక అంతా జనానికి పంచేయడం జరిగిపోయింది. ఆ జనం అంతా నిజమైన జనమా అంటే అది వేరే సంగతి.
అసలు ఇసుక ఉచిత పథకం ప్రభుత్వం ఎందుకు అంత సడెన్ గా అనౌన్స్ చేసింది. ర్యాంపులు, వగైరా అన్నీ సెటిల్ చేసి చేసి వుండాల్సింది కదా… అసలు ఏం జరిగింది అంటే ప్రతి జిల్లాలో రెండు మూడు ఇసుక డిపోలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ భారీగా ఇసుక నిల్వలు చేర్చింది. అమ్మకాలు సాగించింది.
కానీ ప్రభుత్వం అధికారం మారడంతోనే ఈ ఇసుక నిల్వలు అనాధలుగా మారాయి. బలం వున్నవాడికి వాటి మీద కన్నుపడింది. జనసేన, తేదేపా నాయకులు వాటిని మాయం చేయడం మొదలుపెట్టారు. ఈ వార్తలు పత్రికల్లో వచ్చాయి. దాంతో ఉభయ కుశలోపరిగా వుంటుందని ప్రభుత్వం ఉచిత ఇసుక పథకం పెట్టింది. వీలయైనన్ని నిబంధనలు పెట్టారు.
కానీ వడ్డించేవాడు మనవాడు అయితే కావాల్సింది ఏముంది. పెద్దలు చకచకా లారీలను రంగంలోకి దింపారు. అపార్ట్ మెంట్లు కట్టేవారి దగ్గర కావాల్సినంత చోటు. రోజుల్లో ఇసుక ర్యాంపులు అన్నీ ఖాళీ. ఇప్పుడు ఇసుక కావాలంటే నదులు, ఏరులు దిక్కు.
ఇక్కడే మరో సమస్య ప్రారంభమైంది. వర్షాలు పోటెత్తాయి. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఏటిలో, నదిలో దిగి ఇసుక తీసే పరిస్థితి లేదు. దాంతో ఇసుక ఇప్పుడు కరువైంది. రేటు బరువైంది.దీంతో ఉచిత పథకం ముందు ఇసుక రేటు కన్నా ఇప్పుడు పెరిగిపోయింది.
ఈ పరిస్థితి మారాలంటే మళ్లీ నదుల నుంచి ఇసుక బయటకు రావాలి. ఈ లోగా ప్రభుత్వం సరైన పూల్ ప్రూఫ్ విధానం రూపొందించాలి. బల్క్ గా ఇసుక పట్టుకెళ్లే అవకాశం లేకుండా చేయాలి. అవసరం అయితే జియో ట్యాగింగ్ విధానం, లేదా ఇంకా మరేదైనా విధానం అమలుచేయాలి.
లేదంటే గత ప్రభుత్వం ఇసుక కారణంగా ఎంత అపప్రధ మూటకట్టుకుందో, అంతకు అంతా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వస్తుంది.