రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఊహించని పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో, ఎప్పుడు ఎవరు ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటారో అర్థం కాదు. కలవడానికి అండ్ విడిపోవడానికి అనేక రాజకీయ ప్రయోజనాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సామాన్యులు ఒకరకంగా ఆలోచిస్తే, రాజకీయ నాయకులు మరోరకంగా ఆలోచిస్తారు.
అక్కరకు రాని చుట్టాన్ని గ్రక్కున విడువంగ వలయు అన్నట్లుగా తమకు పనికి రాదనుకుంటే ఎంతటి దాన్నైనా వదిలేస్తారు. రాజకీయాల్లో వదంతులు, ఊహాగానాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ కాలంలో సోషల్ మీడియా బాగా పెరిగిపోవడంతో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశాడు. అక్కడే ఎందుకు ధర్నా చేశాడనేదానిపై ఎవరికివారు తమ భాష్యం చెబుతున్నారు.
చంద్రబాబు ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాబట్టి జగన్ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు కాబట్టి ఇండియా కూటమిలో భాగస్వామి అయిన అఖిలేష్ యాదవ్ ఆయనకు మద్దతు ఇచ్చాడు. జగన్ ధర్నా తరువాత ఆయన పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. అధికారంలో ఉన్న కాలంలో బీజేపీకి సపోర్ట్ చేశాడన్న పేరున్న జగన్ ఇప్పుడు బాబు ఆ కూటమిలో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేసే అవకాశం లేదు.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే .. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ నుంచి బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయని. ఇదిప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అన్న జగన్ ఉన్న కూటమిలో షర్మిల ఉండదని అంటున్నారు. వాళ్లిద్దరికీ రాజకీయ వైరం ఉంది కాబట్టి ఆమె ఉండే అవకాశం లేదంటున్నారు.
జగన్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి షర్మిల కూడా కారణమనే అభిప్రాయం ఉంది. జగన్ పైన ఆమె కూడా ఘాటు విమర్శలు చేసింది. ఇప్పుడు ఆయన ఇండియా కూటమిలోకి వస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేదనే అభిప్రాయం కలుగుతోంది. ప్రస్తుతానికి ఇదొక అంచనా మాత్రమే. కానీ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం.