సినిమా హీరోలపై కొందరు మితిమీరిన అభిమానం పెంచుకుంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే హీరోలే ఎక్కువ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అభిమాన హీరో సినిమాల రికార్డుల మాయలో పడి.. తమ విలువైన సమయాన్ని, డబ్బుని కోల్పోతారు. అభిమానం మత్తులో పడి భవిష్యత్ ని పణంగా పెట్టేవారు కూడా ఎందరో ఉంటారు. అలాంటి వెర్రి అభిమానులను మందలించే హీరోలు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన హీరోనే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).
బాలయ్య ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. అయితే హిట్స్ లోనూ, ఫ్లాప్స్ లోనూ బాలకృష్ణ ఒకేలా ఉంటారు. విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కృంగిపోవడం ఆయనకు తెలియదు.
బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఏడాదిపాటు కొన్ని థియేటర్లలో ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా దీనిని సెలెబ్రేట్ చేసుకోవాలని భావించిన కొందరు అభిమానులు.. బాలయ్యని కలిశారట. ‘వీరసింహారెడ్డి’ వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ చేయాలనుకుంటున్నామని, దానికోసం ప్రత్యేక బైట్ ఇవ్వాలని బాలకృష్ణని అభిమానులు కోరారట. అయితే బాలయ్య మాత్రం ఇలాంటి రికార్డులు చూపించడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారని క్లాస్ పీకారని తెలుస్తోంది. ఆ సినిమా విజయం సాధించిందని, ప్రేక్షకులు ఆదరించారని అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, అభిమానానికి కూడా హద్దు ఉండాలని హితవు పలికారట. సెలెబ్రేషన్స్ పేరుతో సమయం, డబ్బు వృధా చేసే అభిమానుల విషయంలో బాలకృష్ణ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.