ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని గంటల ముందే.. వైసీపీ జాబితాను రిలీజ్ చేసింది హైకమాండ్. 175 అసెంబ్లీ స్థానాలు.. 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది. ఇడుపులపాయ వేదికగా.. వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఎంపీ నందిగామ సురేష్ అభ్యర్థుల పేర్లను చదివి ప్రకటించారు. 2019 ఎన్నికల తర్వాత ఆయా ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది..? నియోజకవర్గంలో ఆయన చేసిందేంటి..? ప్రజల్లో వారి ప్రాముఖ్యత..? సర్వేలు సదరు ఎమ్మెల్యే గురించి ఏం చెప్పాయ్..? ఇంటెలిజన్స్ ద్వారా చేయించి సర్వేలతో జాబితాను వైసీపీ సిద్ధం చేసింది. ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించగలిగామని జగన్ చెప్పుకొచ్చారు.
ఎవరికెన్ని..?
కాగా.. మొత్తం అభ్యర్థుల్లో 50 శాతం అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11 ఎంపీ, ఓసీ 9, ఎస్సీలకు 4 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు 1 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చింది వైసీపీ. ఇదిలా ఉంటే.. 2019లో బీసీలకు 41.. ఇప్పుడు 48 స్థానాలు.. మొత్తంగా ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు 200లో ఎస్సీలకు 33 స్థానాలు ఇచ్చారు. అలాగే.. 2019లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు మొత్తంగా 86 స్థానాలు ఇవ్వగా.. ఈసారి 200 సీట్లలో(175+25) 100 స్థానాలు ఇచ్చినట్లు వెల్లడించారు. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా పార్టీ ప్రకటించింది.
అభ్యర్థుల జాబితాను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. మార్పులు, చేర్పుల విషయంలో జగన్ చాలా ఆలోచించారని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకూ మార్పులు చేర్పులపై కసరత్తు జరిగింది పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడానికి జగన్ వెనుకాడరట. మరికొన్ని చివరి నిమిషంలో మార్చాలనే ప్రతిపాదన ఉపసంహరించుకున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.. ముందుగా అనుకున్నట్లుగానే అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే.. ఓసీలలో సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనే మార్పులు చేర్పులు గట్టిగానే జరిగాయి. ఇక బదిలీలను మాత్రం యథాతదంగా జగన్ ఉంచడం జరిగింది. గుంటూరు జిల్లా వేమూరు నుంచి.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు మంత్రి మేరుగ నాగార్జునను బదిలీ చేయడం జరిగింది. ఇక సెంట్రల్ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మొండిచేయి చూపించారు.
151అసెంబ్లీల్లో 81 స్థానాల్లో మార్పులు, బదిలీలకే సరిపెట్టుకుంది వైసీపీ. అయితే.. సీట్లు దక్కని వారందర్నీ బుజ్జగించే పనిలో పడింది హైకమాండ్.