అమరావతి సందడి శురూ! Great Andhra


ఎన్నికలలో జగన్ ఓటమికి కారణాలేమిటి? అనే అంశంపై నా విశ్లేషణ కోసం ఎదురు చూసేవారు యింకొంత కాలం ఆగాలి. నేను ఎన్డీఏ సెంట్రిక్‌గా దేశంలో రాష్ట్రాలన్నిటినీ వరుసగా పరామర్శిస్తున్నాను. సౌత్ జోన్‌కి వచ్చినపుడు అప్పుడు ఆంధ్ర గురించి రాయబోతున్నాను. ఇక తెలుగుదేశం పాలన, హామీల అమలు గురించి కూడా యిప్పుడే రాద్దామనుకోవటం లేదు. ఐదేళ్ల విరామం తర్వాత అధికారంలో కుదురుకోవడానికి సమయం పడుతుంది కదా. అయితే అమరావతి గురించి జరుగుతున్న హడావుడి కొట్టవచ్చినట్లు కనబడుతోంది కాబట్టి, కేంద్ర బజెట్‌లో దానికై 15 వేల కోట్ల కేటాయింపుపై హర్షధ్వానాలు చెలరేగుతున్నాయి కాబట్టి దాని గురించి వెంటనే రాయవలసిన అవసరం కనబడింది.

టిడిపి పార్టీకి గాని, దాని సమర్థులకు కానీ, నిధులు సమకూర్చేవారికి కానీ అమరావతి అనేది ప్రధాన అంశమనేది అందరికీ తెలుసు. పెట్టుబడి పెట్టిన వారందరూ ఒకే కులానికి చెందిన వారు కాదు. చోదకులు, ప్రచారకులు కమ్మవారే అయినా, అక్కడ పెడితే సిరులు కురుస్తాయని నమ్మి అనేక ప్రాంతాల వారు, అనేక కులస్తులు, అనేక వర్గాల వారూ అప్పులు సైతం చేసి అక్కడ స్థలాలు కొన్నారు. అమరావతి మహానగరాన్ని నిర్మించడానికి మోదీ సాయపడతాడని మనసారా నమ్మారు. జగన్ వచ్చాకనే అమరావతి అభివృద్ధి సడన్‌గా ఆగిపోయిందని చాలామంది కథనాలు వెలువరిస్తూంటారు. అది నిజం కాదు.

బాబు హయాంలోనే మహానగరం రూపు దిద్దుకోవడం లేదని గ్రహించి, అమరావతి భూముల రేట్లు 2017 నాటికి పడిపోసాగాయి. ఏమీ చేయలేక పోతున్నాడని పెట్టుబడిదారులు బాబుపై విమర్శలు గుప్పించారు. ఆ వైఫల్యంలో తన పాత్ర ఏమీ లేదని చూపించుకోవడానికే బాబు మోదీపై ధ్వజమెత్తి కేంద్రం సహకరించ లేదని గణాంకాలు వల్లించారు, దీక్షలు చేశారు. 2018 మార్చిలో వేరు పడ్డారు. తీరా చూస్తే మోదీ నెగ్గేశారు. బాబు ఘోరంగా ఓడిపోయారు. దాంతో అమరావతిపై ఆశలు పెట్టుకున్నవారందరూ కళవెళ పడ్డారు. ఫలితాలు రాగానే నాకు చాలామంది రాశారు – ఇప్పుడు అమరావతి గతి ఏమిటి? అని. సమాధానంగా అప్పుడు ‘‘అమరావతి ఏమౌతుంది?’’ అనే వ్యాసం రాశాను.

దానిలో పాయింట్లు మళ్లీ రాయడం అనవసరం కానీ, మహానగరం కట్టడంపై ఎంతో మక్కువ, అవసరం ఉన్న చంద్రబాబు హయాంలోనే అది అసాధ్యమని తేలిపోయింది కాబట్టి, సేకరించిన భూములను రైతు సహకార సంఘాలకు యిచ్చి, వ్యవసాయం చేయించడమే మంచి పరిష్కారం అని రాశాను. ఇంతటి భూరి ప్రణాళిక వాస్తవరూపం దాల్చాలంటే ఆసక్తి, శక్తి రెండూ ఉండాలి. శక్తి బాబుకీ, జగన్‌కీ యిద్దరికీ లేదు. జగన్‌కు ఆసక్తీ లేదు. రాజధాని అంటే సాదాగా ఉంటే చాలదా? మహానగరం కావాలా? అనే దృక్పథం అతనిది. అలా అనుకుని ఏదో చిన్న స్థాయిలోనే రాజధాని కొద్దికొద్దిగా కడుతూ ఉంటే సరిపోయేది. రాష్ట్ర బజెట్ చాలదు, కేంద్రం సహకరించటం లేదు అని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే ప్రజలు సరేలే అని ఊరుకునేవారు.

కానీ జగన్ దాన్ని శత్రుక్షేత్రంగా పరిగణించి అమరావతి ప్రాధాన్యతను తగ్గిద్దామని చూశాడు. దానిలో రూపాయి పెట్టుబడి పెట్టినా బాబు దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని భయపడ్డాడు. టిడిపి వాళ్లు అంటూంటారు – ‘బాబు సైబరాబాదు కట్టారు కదాని, తర్వాత వచ్చిన వైయస్ దాన్ని ఆపలేదు. వైయస్ కొడుకు జగన్ మాత్రం అమరావతిని ఆపేశాడు.’ అని. సైబరాబాదుకి పునాది రాయి బాబుకి ముందే పడింది. బాబు తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం, ఆ తర్వాత తెరాస ప్రభుత్వం దాని అభివృద్ధికి ఎంతో చేశాయి. మొత్తమంతా కలిపి చూస్తే బాబు వాటా తక్కువే. అయినా సైబరాబాదు అనగానే ఆ క్రెడిట్ అంతా ఎవరి ఖాతాలో పోతోంది? బాబు ఖాతాలో! తెలుగు మీడియాను ఆ లెవెల్లో మేనేజ్ చేస్తాడాయన!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఆయన హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగినట్లు బిల్డప్ యిస్తుంది మీడియా. బాబు అనునిత్యం, అనుక్షణం అదే ధోరణిలో మాట్లాడతాడు. 2018లో తెలంగాణ ఎన్నికలలో టిడిపి, కాంగ్రెసు పొత్తు పెట్టుకున్నపుడు వైయస్ చేసిన ప్రాజెక్టులను కూడా బాబు తన ఖాతాలో వేసుకుని మాట్లాడుతూంటే పక్కనే ఉన్న రాహుల్ కిమ్మనలేదు. ఇవన్నీ చూసిన జగన్ అమరావతి స్థాయిని ఎంత తగ్గిస్తే బాబుని అంత తగ్గించినట్లు అవుతుందని అనుకున్నాడు. దానికి అనుగుణంగా ఏదో సంసారపక్షంగా రాజధాని పూర్తి చేసి, తక్కిన చోట్ల డెవలప్ చేసుకుంటూ పోతే సరిపోయేది. కానీ మూడు రాజధానులు అన్నాడు. అమరావతి మూడో వంతు రాజధాని మాత్రమే అన్నాడు. అది కూడా లెజిస్లేటివ్ రాజధాని మాత్రమే అన్నాడు.

రాజధానుల మాట ఎత్తినప్పుడే నేను ఎత్తి చూపాను – హైకోర్టు ఉన్నంత మాత్రాన న్యాయరాజధాని, అసెంబ్లీ ఒక సెషన్ పెట్టినంత మాత్రాన లెజిస్లేటివ్ రాజధాని అయిపోవని. దేశంలో అనేక రాష్ట్రాలలో వేర్వేరు చోట్ల ఉన్నాయి కానీ వాళ్లెవరూ రాజధాని అనరు కదా! అదేమిటో జగన్‌కే కాదు, బాబుకి కూడా రాజధాని పదంపై మోజు. ఇప్పుడు విశాఖను ఆర్థిక రాజధాని చేస్తారట. మూడు రాజధానులంటే మూడు ముక్కలాట అని జగన్‌ను నిరంతరంగా వెక్కిరించిన టిడిపి, సంబంధింత మీడియా యిప్పుడు రెండు ముక్కలాట అని ఎందుకు అనదో నాకు తెలియదు. ఒక దశలో బాబు ఆధ్యాత్మిక రాజధాని, సాంస్కృతిక రాజధాని… అంటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేసేస్తాం అని చెప్పుకొచ్చారు. అప్పుడు 13 ముక్కల సెట్టు పూర్తయింది అని ఎవరూ ఎద్దేవా చేయలేదు మరి.

పోనీ రాజధాని పేరు వదిలేసినా, వికేంద్రీకరణ అనుకున్నా, కర్నూలుకి హైకోర్టు యివ్వడం న్యాయం, వైజాగ్ అమరావతిలలో వైజాగ్‌లో అప్పుడప్పుడు అసెంబ్లీ సెషన్లు పెట్టి, అమరావతిని ఎగ్జిక్యూటివ్ సెంటర్‌గానే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అప్పటికే అక్కడ సెక్రటేరియట్, గవర్నరు భవనం వగైరాలు వచ్చేశాయి కనుక. సెక్రటేరియట్ సిబ్బందిని హైదరాబాదు నుంచి బతిమాలి తీసుకెళ్లినపుడు వాళ్లకు యిళ్ల స్థలాలు యిస్తామని, అనేక విషయాల్లో రాయితీలు యిస్తామని చెప్పారు. మళ్లీ వైజాగ్‌కి తరలిస్తే అక్కడా యిస్తామని జగన్ అన్నాడు. శుద్ధ దండగ వ్యవహారం. అయినా పంతం పట్టి అమరావతి విలువ తగ్గించడానికి జగన్ శతథా చూశాడు. చూశాడు కానీ చేయలేక పోయాడు.

జగన్‌ను బాబు అండర్ ఎస్టిమేట్ చేసినట్లే, బాబుకి అన్ని చోట్లా ఉన్న క్లౌట్‌ను జగన్ అండర్ ఎస్టిమేట్ చేశాడు. కోర్టులు అడ్డు తగిలాయి. ఉద్యమాలు జరిగాయి. అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయిందనే ప్రచారం సాగింది. రాజధాని మారుద్దా మనుకోవడం వరకు కరక్టే కానీ అసలు రాజధాని లేకుండా పోయిందని ఎలా అంటారు? సెక్రటేరియట్ అక్కడే ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. రాష్ట్ర వార్తల డేట్‌లైన్ అంతా అక్కణ్నుంచే వస్తోంది. అయినా అలాగే గోల చేశారు. కోర్టు మొట్టికాయలతో జగన్ బిల్లు వెనక్కి తీసుకున్నాడు. వివేకం ఉంటే 2019 ఎన్నికలలో రాజధానుల వికేంద్రీకరణ అంశాన్ని మానిఫెస్టోలో పెట్టాల్సింది. కానీ యీ లోపునే వైజాగ్‌కి వెళతానంటూ పది, పదిహేను ముహూర్తాలు పెట్టి, ఏ ఒక్కటీ వర్కవుట్ కాక నగుబాటు అయ్యాడు. అయిన కొద్దీ పంతానికి పోయాడు.

ఈ విధంగా అమరావతి పురహరుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ‘ప్రపంచ కమ్మవారందరిలో ఐకమత్యం తెచ్చిన జగన్’ అని ఒక కాప్షన్ చూశాను. దానితో పాటు ‘కుల, ప్రాంత, స్థాయీ భేదం లేకుండా అమరావతి పెట్టుబడిదారులను ఏకత్రాటిపై తెచ్చిన జగన్’ అని కూడా చేర్చాల్సింది. జగన్ ఉన్నంతకాలం అమరావతిపై పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు అని తేల్చుకున్న వారు జగన్ తిరిగి రాకూడదని క్షుద్రపూజలు చేశారో లేదో తెలియదు కానీ, బాబు తిరిగి రావాలని మాత్రం పూజలు చేశారు, మొక్కులు మొక్కారు, ముడుపులు కట్టారు. పెట్టినది రాబట్టాలంటే మరి కొంత ఖర్చు చేయాలనుకుంటూ నిధులూ యిచ్చారు. పూజలూ, ప్రయత్నాలూ ఫలించాయి. బాబు తిరిగి వచ్చారు. తనపై వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయటం లేదని చూపడానికి వస్తూనే అమరావతి హడావుడి మొదలుపెట్టారు.

ఎన్నికలకు ముందు ‘‘అమరావతి ఎన్నికల అంశం కాదా?’’ అనే వ్యాసం రాశాను. ఐదేళ్లగా హడావుడి చేసిన అమరావతి గురించి ఎన్నికల సమయంలో టిడిపి సందడి చేయలేదేమని ప్రశ్నించాను. చేయకపోయినా, పైకి చెప్పకపోయినా బాబు గద్దె నెక్కగానే అమరావతి గురించే పని మొదలు పెడతారని అందరికీ తెలుసు. ఎన్నికల్లో నెగ్గగానే బాబు ప్రమాణస్వీకారానికి ముందే అమరావతిలో లైట్లు వెలిగాయని, రోడ్లు వెడల్పయ్యాయని వార్తలు విడుదల కావడం ప్రారంభమైంది. ఫలితాలు వచ్చిన మర్నాడే కొందరు భూములు కొన్నారట. రేట్లు 20శాతం పెరిగాయట. ఇక అప్పణ్నుంచి అమరావతి గురించి ఏదో ఒక న్యూస్ వస్తోంది. ‘ఎపి అంటే అమరావతి, పోలవరం అనే మాట కాయిన్ చేశారు. అక్షరమాలలో అ అంటే అమ్మ అన్నట్లు బాబు పాలనలో అ నుంచి హ వరకు అమరావతే కనబడుతుంది.

పోలవరం అనేది కేంద్రం అజమాయిషీలో ఉన్నది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర అజమాయిషీలోనే ఉంది. దాని గురించిన మంచిలో, చెడులో దానికి వాటా ఉంది. ఇవాళ బజెట్‌లో కూడా ‘పోలవరం నిర్మాణానికి అండగా నిలుస్తామ’నే అస్పష్ట ప్రకటనే వచ్చింది. అంకెలు రాలేదు. పునరావాస ప్యాకేజి ఖర్చు భరిస్తానని కేంద్రం అనేదాకా పైపై కబుర్లుగానే పరిగణించాలి. పోలవరంది నత్తనడక కాబట్టి ఎంతకాలమైనా చెప్పుకోవచ్చు. దానిపై పెట్టుబడి పెట్టినవారు, ఫలానా టైముకి పూర్తవుతుందని పందాలు కట్టినవారూ లేరు. కానీ అమరావతిలో స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు. అందువలన ఫోకస్ అంతా అమరావతి పైనే ఉంటుంది. సూపర్ సిక్స్, తక్కిన హామీల గురించి మాట్లాడితే ‘అధికారంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు, అప్పుడే వాటి గురించి అడగడం సబబు కాదు’ అని వారించేవారు సైతం ‘అమరావతి విషయంలో మాత్రం యింత హడావుడి ఎందుకు జరుగుతోంది?’ అనేదానికి సమాధానం చెప్పలేరు.

నిజానికి వారు చెప్పనక్కరలేదు కూడా. ప్రజాస్వామ్యానికి నిర్వచనం ‘ప్రజల కోసం, ప్రజల చేత..’లా టిడిపి ఫోకస్ అంతా అమరావతి పైనే ఉంటుంది. ప్రమాణస్వీకారం చేసిన జూన్‌లోనే 29న ఎపి-సిఆర్‌డిఏ (కాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అమరావతి గవర్న్‌మెంట్ కాంప్లెక్స్ కోసం అంటూ 5 గ్రామాల్లో 1575 ఎకరాలు ఎక్వయిర్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డెవలప్ చేస్తామంటూ యిప్పటిదాకా తీసుకున్న భూముల విషయంలో అతీగతీ తేలటం లేదు. భాగస్వాములైన రైతుల విషయంలో న్యాయం జరగలేదు. మార్కెట్ రేటుకి కొనేసి, ప్రభుత్వం సొంతం చేసుకోలేదు. డెవలప్ చేసిన ప్లాట్లు యిస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పింది. (ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రశ్న కాదు, ప్రభుత్వంతో వాళ్లు లావాదేవీలు చేసుకున్నారు).

అది తేలకుండానే కొత్తగా యీ భూమి ఎందుకో బాబు ప్రభుత్వానికే తెలియాలి. నిజానికి ఎన్నికలకు ముందు బాబు ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’కు యిచ్చిన యింటర్వ్యూలో ‘‘నేను అమరావతి గురించి సింగపూరు తరహాలో వేసిన పథకాలన్నీ జగన్ వలన నాశనమయ్యాయి.’’ అంటూనే ‘‘ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఒరిజినల్‌గా కన్సీవ్ చేసిన స్థాయిలో దాన్ని కట్టలేము.’’ అని ఒప్పేసుకున్నారు. ‘కానీ కేంద్రం సహాయంతో చేస్తామనే నమ్మకంతో ఉన్నాను.’ అని చెప్పుకున్నారు. ఆ సాయం ఏమిటో యివాళ ఒక ఝలక్ వచ్చింది. బాబు ఒరిజినల్ విజన్ డాక్యుమెంటు ఏమిటి? – ప్రపంచంలో టాప్ త్రీ (నారాయణ యిప్పుడు టాప్ టెన్ అంటున్నారు) లివబుల్ సిటీస్‌లో ఒకదానిగా అమరావతిని చేస్తానన్నారు. 50శాతం గ్రీన్ కవరేజి. 217 చ.కి.మీ.ల కాపిటల్ ఏరియా. 9 నగరాలు – గవర్నమెంటు సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెజ్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా, కల్చర్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, టూరిజం సిటీ కడతామన్నారు.

వీటిని డెవలప్ చేస్తామంటూ 29,966 మంది రైతుల నుంచి 34,400 ఎకరాల భూమి సేకరించారు. భూమికి బదులుగా పూర్తయ్యాక రెసిడెన్షియల్, కమ్మర్షియల్ ప్లాట్లు యిస్తామని చెప్పి, ప్రాజెక్టు పూర్తయ్యేవరకు నెలనెలా కౌలు యిస్తూ ఉన్నారు. ఋణమాఫీ, పెన్షన్లు వంటి సామాజిక ప్రయోజనాలు కూడా కల్పిస్తామన్నారు. ఇది ఒక వాణిజ్య ఒప్పందం. దీనిలో త్యాగం అనే మాటకు తావే లేదు. ప్రభుత్వం తన వంతు షరతు పూర్తి చేయలేదు. ఇప్పుడీ 1575 ఎకరాలు ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారో ఆ నోటిఫికేషన్‌లో నేను చూడలేదు. పాత తరహా ఒప్పందం అంటే రైతులు యిస్తారా? ఇవ్వనంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? మార్కెట్ రేటు యిచ్చి కొంటాం అంటే పాత రైతులు, మాకూ అలాగే యివ్వవచ్చుగా అంటారా?

ఈ సందేహాలు మీడియా లేవనెత్తటం లేదు. ఎంతసేపూ అమరావతి నిద్ర లేచింది, జీవం పోసుకుంది, పరుగులు పెడుతోంది అనే వార్తలే వండి వారుస్తున్నారు. ‘‘హిందూ’’లో ‘అమరావతి- ఫ్రమ్ ఘోస్ట్ సిటీ టు మోడల్ సిటీ’ అనే కాప్షన్‌తో సాంబశివరావు అనే ఆయన ఆర్టికల్ రాశారు. అమరావతిని ఘోస్ట్ సిటీ అని ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు. బొత్స సత్యనారాయణ ‘అక్కడేముంది, వల్లకాడు’ అన్నారనా? ఆ అమరావతి నుంచే పాలన సాగింది కదా, సెక్రటేరియట్, మంత్రులు ఆఫీసులు, పార్టీల ఆఫీసులు అన్నీ ఉన్నాయి కదా. వైసిపి వచ్చాక అమరావతిలో కొత్త నిర్మాణాలు పెద్దగా చేయలేదనుకున్నా, ఓ స్థాయి వరకు వచ్చినవి పూర్తి చేసి ఉంటారు కదా. కొద్దిగా కట్టి వదిలేసినవి కూలగొట్ట లేదు కదా. అలాటప్పుడు ఘోస్ట్ సిటీ ఎలా అవుతుంది. ఇక రెండోది మోడల్ సిటీ. అది ఎప్పుడు అవుతుందో ఎవరైనా చెప్పగలరా? చివర్లో ప్రశ్నార్థకం పెట్టవద్దా?

45 కేంద్ర సంస్థలు తమ ఆఫీసులను అమరావతిలో పెట్టబోతాయని ఆంధ్రజ్యోతి వార్త. గతంలో చంద్రబాబు హయాంలో పెట్టారట, బాబు స్థలాలు కేటాయించారట. కానీ వాళ్లు ఆఫీసులు కట్టలేదట, కట్టలేదేమని జగన్ స్థలాన్ని వెనక్కి తీసుకుంటానంటే వాళ్లు కోర్టు కెళతామని అన్నారట. ఇప్పుడు మళ్లీ ముందుకు వస్తున్నారట. ఆ జాబితాలో ఉన్న ఇండియా పోస్టు, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ వగైరా కేంద్ర సంస్థలు రాష్ట్రంలో ఎక్కడైనా ఆఫీసులు పెట్టవచ్చు. అసలవి యిప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్నాయా? సొంత భవనాల నుంచా? అద్దె భవనాల నుంచా? అమరావతిలో సొంత భవనాలు అవసరమని అవి ఫీలవాలి కదా. వాటికి బజెట్ కేటాయింపులు ఉండాలి కదా! అదంతా బాబుకి అనవసరం. తన చేతిలో ఉన్న పని స్థలం కేటాయింపు. అది చేసేశారు. మరి అవి భవనాలు కట్టలేదేం? బాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే కట్టాలని తీర్మానించు కున్నాయా? వాటిలో ఏ ఒక్కదానికీ జగన్ టైములో కట్టాలని తోచలేదా? ఫన్నీగా లేదూ?

వాటిలో 33టికి స్థలాల కేటాయింపు జరిగిందని, తక్కినవాటికి జరగబోతోందని కాపిటల్ రీజియన్ ప్రకటన. కేంద్ర సంస్థలు క్యూలు కడుతున్నాయని కొన్ని వెబ్‌సైట్ల ప్రచారం. గతంలోనే మొత్తం 132 (వీటిలో ఎన్ని కేంద్రసంస్థలు? ఎన్ని రాష్ట్రం సంస్థలు? అందరూ అమరావతిలో ఐతేనే పెడతాయన్నాయా?) సంస్థలకు స్థలాలు కేటాయించారని వార్త. అంటే జరుగుతున్న దేమిటి? అమరావతి భూములను కనబడిన ఆఫీసుల కల్లా కేటాయించేసి, అక్కడ అది వస్తోంది, యిక్కడ యిది వస్తోంది అని ప్రచారం చేసుకోవడానికి రియల్ ఎస్టేటు వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఏళ్లూపూళ్లూ గడిచినా వారు కట్టరు. ఎందుకు కట్టరు? జగన్ రాజధానిలో మూడో వంతు మాత్రమే యిక్కడ ఉంచుతానని అన్నాడు కాబట్టి అంటారా? ఇండియన్ నేవీకి, రాజధానికి సంబంధం ఏమిటి? యూనివర్శిటీలకు, యోగా సంస్థలకు వందల ఎకరాలు కట్టబెట్టారు బాబు. వాటికీ, రాజధానికీ సంబంధం ఏమిటి? ఆ స్థలాల్లో అవి యిన్నేళ్లలో ఏమైనా కట్టాయా?

ఇదంతా చూస్తే ఏమనిపిస్తోంది? ఏడెనిమిదేళ్ల క్రితం నాటి అమరావతి కథ పునరావృతమౌతున్నట్లు తోచటం లేదూ? రియల్ ఎస్టేటును లేపడానికే యిదంతా అనిపించటం లేదూ? అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని బాబు చెప్తూ వచ్చారు. బంగారు గుడ్లు పెట్టే బాతుని జగన్ చంపేశాడన్నారు. బంగారు బాతు తయారు చేయడానికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఆయన మర్చిపోతూ ఉంటారు. జగన్ అమరావతిలో నిర్మాణాలు ఆపేసినప్పుడు ‘దాదాపు అంతా పూర్తయిపోయింది, పూర్తి చేయడానికి లక్ష కోట్లు కావాలని జగన్ చెప్తున్నది అబద్ధం. ఏ పది, పదిహేను వేల కోట్లో సరిపోతుంది.’ అని టిడిపి వారు వాదించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి తొలి దశలో 48 వేల కోట్ల ఖర్చు, 3 విడతల్లో కలిపి లక్ష కోట్లు అవుతాయన్నారు. ఇది పాత మాస్టర్ ప్లాను ప్రకారం చేయడానికి! కొత్తగా గెజిట్ నోటిఫికేషన్ యిచ్చిన 1575 ఎకరాలు డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు దీనికి కలపాలేమో!

వీటన్నిటికీ డబ్బు ఎక్కణ్నుంచి వస్తుంది? 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి కంటె యిప్పుడు రాష్ట్రం మరింత అధ్వాన్నంగా ఉందని బాబు శ్వేతపత్రాల ద్వారా చాటుతున్నారు. ఆర్థిక స్థితి మరింత హీనమవడంతో పాటు, తలకెత్తుకున్న హామీల భారం మరింత పెరిగింది కూడా! ఇవన్నీ ఎలా చేయగలుగుతాడా? సంపద ఎలా సృష్టిస్తాడా? అని మనం బెంగ పడుతూ ఉంటే నిన్నటి గవర్నరు ప్రసంగంలో ‘ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పరిస్థితి కనబడటం లేదు. 10 లక్షల కోట్ల అప్పు ఉంది. చర్చల తర్వాతనే పూర్తి స్థాయి బజెట్‌కు వెళతాం.’ అని చెప్పించారు. ఇలాటి పరిస్థితిలో మహానగర నిర్మాణానికి నిధులు సమకూర్చడం ఎలా? ఇవాళ బజెట్‌లో కేంద్రం 15 వేల కోట్లు కేటాయించింది. అదేమీ గ్రాంట్ కాదు. విభజన తర్వాత రాజధాని కట్టుకోవడానికి కేంద్రం సమకూర్చవలసిన సాయం కాదు. మా పూచీకత్తుతో వివిధ సంస్థల ద్వారా అప్పులిప్పిస్తామంతే అన్నారు. దీనికే టిడిపి వారు ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నారు.

‘‘కోరస్’’ (1975) అని మృణాల్ సేన్ సినిమా ఉంది. 100 వేకెన్సీలున్నాయని ప్రకటిస్తే వేలాది మంది నిరుద్యోగులు వస్తారు. 1:10 చొప్పునే యింటర్వ్యూకి పిలుస్తామని కంపెనీ చెప్తే, నిరుద్యోగులంతా ఆందోళన చేస్తారు. చివరకు కంపెనీ చైర్మన్ మెత్తపడి, జాలి పడి 1:20 చొప్పున పిలుస్తామని ప్రకటిస్తాడు. ఉద్యోగాల సంఖ్య పెరగలేదు. ఆశావహుల సంఖ్య పెరిగిందంతే. వాటె క్రూయల్ జోక్! కేంద్రం చేసినది అలాగే ఉంది. తమ ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్న రాష్ట్రానికి అప్పుల భారం పెంచుతానంటోంది తప్ప, గ్రాంట్ యిస్తాననలేదు. దీనిలో పండగ చేసుకోవాల్సి ఏముందో నాకు అర్థం కావటం లేదు.

గతంలో ప్రత్యేక ప్యాకేజీ కాస్తకాస్త యిచ్చినపుడు దానికి యుసిలని, మరోటని కేంద్రం చాలా చిక్కుముళ్లు వేసింది. వాటిని విప్పడం బాబు వలన కాలేదు. ఇప్పుడేమవుతుందో తెలియదు. ఎన్డీఏ ప్రభుత్వానికి బాబు, నీతీశ్ చెరో కొమ్ము కాస్తున్నా, బజెట్‌లో బిహార్‌కు కంచంలో, ఆంధ్రకు ఆకుల్లో వడ్డించినట్లు కనబడుతోంది. ఇప్పట్లో ఆంధ్రకు ఎన్నికలు లేవు కదా! పైగా కేంద్ర నిధులెన్ని యిచ్చినా క్రెడిటంతా బాబు కొట్టేస్తారన్న శంక ఒకటి! ఈ ఎదురీతలో బంగారు గుడ్లు పెట్టే అమరావతి మహానగరం కట్టాలంటే గత టిడిపి హయాంలోని పెండింగు బిల్లులు (జగన్ చెల్లించకుండా ఉంచినవి), జగన్ హయాంలో పెండింగు పెట్టిన బిల్లులు (రమారమి లక్ష కోట్లు అంటున్నారు) యివన్నీ చెల్లించాలి. లేకపోతే అమరావతి కాంట్రాక్టులు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.

రాష్ట్రం ఎదగాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి. ఈ శ్వేతపత్రాల వెల్లువ వలన రాజకీయంగా లాభం ఉంటుందేమో కానీ, పెట్టుబడులు ఆకర్షించే అవకాశం తక్కువ. ఇలాటి దివాలాకోరు రాష్ట్రంలో, ప్రతీ ఐదేళ్లకూ విపరీతమైన స్వింగ్‌తో అట్టు తిరగేస్తున్న రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే చాలా ధైర్యమే ఉండాలి. బాబు ప్లాన్ చేసిన మహానగరం కట్టడానికి కనీసం 15, 20 ఏళ్లు పడుతుందని అందరూ అనుకున్నదే. ఇప్పుడు నారాయణ రెండున్నరేళ్లలో కోర్ కాపిటల్ కడతా మంటున్నారు. దాని బజెట్ ఎంతో, యీ 15 వేల కోట్లు ఏ మూలకో, రిటర్న్‌స్ ఎంత త్వరగా వచ్చి దానిపై వడ్డీ కట్టగలరో నాకు తెలియదు. చప్పున కట్టకపోతే 2029 నాటికి ఏమౌతుందేమోనన్న భయం కాంట్రాక్టర్లకు ఉంటుంది.

పెట్టుబడులు రావాలన్నా, కాంట్రాక్టర్లు ముందుకు రావాలన్నా అత్యవసరమైనవి శాంతిభద్రతలు. శాంతి, అభివృద్ధి అవిభక్త కవలపిల్లలు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరగనంతగా హింసావాతావరణం సాగుతోంది. ఇది హింస కాదు, ప్రతిహింస అని టిడిపి వాదించవచ్చు; ఇవి రాజకీయ హత్యలు కావు, వట్టి గూండాగిరీయే అని హోం మంత్రి అనవచ్చు; ‘‘షోలే’’లో అమితాబ్ పెళ్లి సంబంధం మాట్లాడిన తీరులో ‘అబ్బే, ముక్కలుముక్కలుగా నరకడం రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరికే గంజాయి సేవించడం చేత జరిగింది తప్ప, మామూలుగా అలాటివాడు కాదు’ అని సమర్థించవచ్చు. కానీ యివేమీ పెట్టుబడిదారులు తృప్తి పడే స్టేటుమెంట్లు కావు. రాజకీయ కారణాలున్నాయా లేదా అన్నది పక్కన పెడితే, రాజధానికి 120 కి.మీ.ల దూరంలో ఉన్న ఊళ్లో నడిరోడ్డుపై యిలా జరగడం మంచి సంకేతాలను పంపదు. ఇది గ్రహించి, త్వరలోనే పరిస్థితిని ప్రభుత్వం సరిదిద్దుతుందనే ఆశిద్దాం.

కేంద్ర బజెట్‌లో అమరావతికి ఏదో కురిపించేశారనే కోలాహలం చూసి, రెట్టింపు రేట్లు పెట్టి అక్కడ స్థలాలు కొందామను కునేవారు కాస్త తమాయించుకుంటే మంచిది. ఇప్పటికే రాష్ట్రం అప్పులకుప్ప, శ్రీలంక, సోమాలియా అయిందని చెప్తూ వచ్చిన టిడిపి అమరావతి కోసం మరో 15 వేల కోట్ల అప్పు తేబోతోంది. నారాయణ చెప్పినట్లు కోర్ కాపిటల్ పూర్తి చేసినా అది అద్భుతమే. అద్భుతాన్ని ఆశించి పెట్టుబడి పెడితే భారీ రిస్కే. బాబు అమరావతి మీదే మొత్తం దృష్టి పెట్టినట్లు, జగన్ వైజాగ్ మీదే పెట్టడంతో వైజాగ్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు దడాలున కింద పడ్డాయి. ఎన్నికల రోజున ఎన్డీఏ పెర్‌ఫామెన్స్ చూసి షేర్ మార్కెట్ బావురుమంది. ఇన్వెస్టర్లు భోరుమన్నారు. అమరావతి వైపు పరుగులు పెట్టేవారు యివన్నీ గుర్తు పెట్టుకుని వ్యవహరిస్తే మంచిది.

ముగించే ముందు యిప్పుడొక సెల్ఫ్ యాడ్, నా పుస్తకాల గురించే! వ్యాసం మధ్యలో యాడ్ వస్తే మరీ చికాకు పడతారని చివర్లో పెట్టాను. గత పది నెలలుగా నేను ఆర్టికల్స్ రాయడం బాగా తగ్గించి, పాత ఆర్టికల్స్, సీరీస్ అన్నీ పుస్తకాలుగా తెచ్చే పనిలో పడ్డాను. ఇప్పటికి 11 పెద్ద పుస్తకాలు (ఒక్కోటీ సగటున 250 ప్లస్ పేజీలు), పడక్కుర్చీ కబుర్లు సీరీస్‌లో 6 పుస్తకాలు (48 పేజీలు) తెచ్చాను. ఏడాది చివరకు మరో 9 పెద్ద పుస్తకాలు తెచ్చే ఆలోచనలో ఉన్నాను. వీటి ఈబుక్ వెర్షన్లు (పిడిఎఫ్, యూనికోడ్) కూడా అందుబాటులోకి తేవాలని ప్రయత్నం. ఇవన్నీ పూర్తయ్యాక ఒక వ్యాసం రాసి పుస్తకాల లభ్యత గురించి చెప్దామనుకున్నాను. ఈ లోపునే యీ సమాచారం యివ్వడానికి కారణం – రాజీవ్ హత్య పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉండడం! 12 ఏళ్ల క్రితం సీరియల్‌గా రాసిన దాన్ని పుస్తకరూపంలో తేవాలని కనీసం 100 మంది మెయిల్స్ రాసి ఉన్నారు. వారి కోసమే యీ ప్రకటన!

నేను ప్రతి పుస్తకం 500 కాపీలు అచ్చు వేసి ప్రచురణకు పూర్వమే కాపీలు తీసుకుంటామన్న వారికి యిచ్చేసి 200 కాపీలు మాత్రమే మార్కెట్‌కు రిలీజ్ చేస్తున్నాను. సేల్స్ ఫిగర్స్ చూడబోతే ప్రతి పుస్తకం నెలకు 10 కాపీలు అమ్ముడుపోతోంది. ‘నన్ను చూసి..’ ‘పురాణ పరామర్శ…’ పుస్తకాలు నెలకు 20 అమ్ముడు పోతున్నాయి. పురాణ పరామర్శ రీప్రింట్‌కు వెళుతోంది. కంటెంట్ మాట ఎలా ఉన్నా, ధర కూడా ఒక కారణం. పేజీకి రూపాయి ధర పెడుతున్న ఈ రోజుల్లో నేను 55-60 పైసలు మాత్రమే పెట్టాను. ఈబుక్స్ విషయంలో కూడా 500 పేజీల పుస్తకాన్ని 100 రూ.లకే యిస్తున్నాను. రాజీవ్ హత్య పుస్తకం త్వరలోనే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఆ పుస్తకాభిమానులు నన్ను నిందిస్తారనే భయంతో తెలియపరుస్తున్నాను. మొత్తం ఏయే పుస్తకాలు వేశాను అనే వివరాలు యిక్కడ యివ్వటం లేదు. లింకులు యిచ్చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు అక్కడకు వెళ్లి చూడవచ్చు, కొనుక్కోవచ్చు. మొత్తం పుస్తకాలు దొరికే లింకు –  ఈ లింకులో కొన్ని పుస్తకాల గురించి వివరణ దొరుకుతుంది. పిడిఎఫ్‌ రూపంలో ఉన్న ఐదు ఈ-బుక్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడే లింకు కానీ యిక్కడ మీరు పుస్తకాల ప్రివ్యూ చూడలేరు. పుస్తకంలో ఐదో వంతు ఉచితంగా చదివేసే వెసులుబాటు లో ఉంది. 3,4,5 పుస్తకాలు మీరు యిక్కడే కొనవచ్చు. 1,2 కొనాలంటే మాత్రం గూగుల్ ప్లే లింకుకి వెళ్లాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2024)



Source link

Leave a Comment