వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రాజధాని ఫైల్స్’. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు.
‘రాజధాని ఫైల్స్’ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ లోగోలో పొలం దున్నే నాగలి ఉండటం ఆకట్టుకుంది. అలాగే పోస్టర్ కూడా ఎంతో క్రియేటివిటీగా ఉంది. ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక యువ నాయకుడు.. వేలాది రైతు కుటుంబాలకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో మరో రాజకీయ నాయకుడు రూపం ఉన్నట్లుగా గమనించవచ్చు. అలాగే పోస్టర్ మీద “ఒకే ఒక్కడి అహం.. వేలాది రైతులకి కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారం.” అని రాసుంది.
వాస్తవ సంఘటనలకు సహజమైన భావోద్వేగాలను జోడించి ప్రేక్షుకుల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ చిత్రాన్ని రూపొందించారట. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.