ఆగస్ట్ 9కి ఉన్న ప్రత్యేకత ఏమిటో సినిమా ప్రేమికులకు, అభిమానులకు తెలిసిందే. ఆరోజు సూపర్‌స్టార్ మహేష్ పుట్టినరోజు. ఒక ప్రాంతమని కాకుండా ఎన్నో చోట్ల మహేష్ పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం వెరీ స్పెషల్. అదేమిటంటే.. ఆరోజు ఘట్టమనేని వారి ఇంట పెళ్ళి జరగబోతోంది. ఆ ఇంట్లో పెళ్లి జరిగి 23 సంవత్సరాలు కావస్తోంది. దాంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. పెళ్లి పనులు ప్రారంభమైపోయాయి. ఆ ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. పెళ్లికి సంబంధించిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆహ్వాన పత్రికలు పంచే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ పెళ్లికి అశేష ప్రజానీకం హాజరవుతారని తెలుస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఎంతో ఘనంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
అయితే ఒకసారి వివాహ ఆహ్వాన పత్రికను పరిశీలిద్దాం. ఘట్టమనేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు మురారిని, చంటి, అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చి॥ల॥సౌ॥ వసుంధరకు ఇచ్చి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్ల పక్ష త్రయోదశి నాడు అనగా ఆగస్టు 9న వివాహం జరిపించుటకు నిశ్చయించినారు. కావున తామెల్లరు విచ్చేసి, మా ఆతిధ్యం స్వీకరరించి వేద పండితుల సాక్షిగా ఒక్కటవుతున్న మా చిరంజీవులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము అని ఘట్టమనేని వారి కుటుంబ సభ్యులు వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించారు.
విషయమేమిటంటే.. సూపర్‌స్టార్ మహేష్ పుట్టినరోజు ఆగస్ట్ 9న. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతని పుట్టినరోజు వేడుకలతోపాటు మరో వేడుక కూడా జరగబోతోంది. అదేమిటంటే.. మహేష్ కెరీర్ క్లాసిక్ మూవీగా నిలిచిన ‘మురారి’ చిత్రాన్ని ఆరోజు రీరిలీజ్ చెయ్యబోతున్నారు. ఆ విషయాన్ని అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. రెగ్యులర్‌గా కాకుండా ఈ రీరిలీజ్‌ను విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ వివాహ ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా డిజైన్ చేయించి ప్రేక్షకులను, ప్రతి అభిమానిని సినిమాకు ఆహ్వానిస్తున్నారు. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మురారి’ చిత్రంతోపాటు ‘ఒక్కడు’ చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేయడం ఫ్యాన్స్‌కి బోనస్ అనే చెప్పాలి. ‘ఒక్కడు’ చిత్రాన్ని ఉదయం నుంచి రెండు షోలు, ‘మురారి’ చిత్రాన్ని సాయంత్రం నుంచి రెండు షోలుగా ప్రదర్శించనున్నారు. మొత్తానికి రీరిలీజ్ ప్రాసెస్‌ని ఇంత డిఫరెంట్‌గా చేస్తున్న మేకర్స్‌ని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రేక్షకులు, మహేష్ అభిమానులు.