రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ప్రధాన నిందితుడు కావడం దేశంలోనే సంచలనం సృష్టించింది. తన అభిమానిని హీరో హత్య చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో రోజురోజుకీ అరెస్టులు పెరుగుతున్నాయి. ఇప్పుడా సంఖ్య 19కి చేరింది. మరోవైపు సోషల్ మీడియాలో దర్శన్‌కు మద్దతుగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. తమ హీరోని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒక వీరాభిమాని తమ హీరో అరెస్ట్ కావడంపై మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
తన అభిమాన హీరో దర్శన్ అరెస్ట్ కావడంతో భైరేష్ అనే అభిమాని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రామనగర జిల్లా చన్నపట్నంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్శన్ అరెస్ట్ అయిన రోజు నుంచి తిండి మానేసిన భైరేష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ బాధను తట్టుకోలేకే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇది ఆత్మహత్యా లేక ఏదైనా ప్రమాదం జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.