దిశ, ఫీచర్స్ : నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజల జీవన శైలి కూడా మారుతోంది. కొన్నిసార్లు ఇది పలు సమస్యలకు కారణం అవుతోంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమై ఉండే మిలీనియల్స్ రోజువారి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటంలో గార్డెనింగ్ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రజెంట్ ‘Zen In Soil And Succulents’ (మట్టి, క్యూలెంట్స్ మొక్కల్లో మానసిక శ్రేయస్సు) అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తోటపని వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ కాన్సెప్ట్ వెల్లడిస్తోంది.
ఆనందానికి.. ఆరోగ్యానికి
మిలీనియల్స్ (28 నుంచి 43 ఏళ్లలోపు వయస్సుగలవారు) తమ రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి ఇటీవల ఎక్కువగా గార్డెనింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఇదొక ఫేవరెట్ అవుట్‌లెట్‌గా మారుతోందని నిపుణులు చెప్తున్నారు. మట్టి, అలాగే సక్యూలెంట్స్ మొక్కల మధ్య ఈతరం వర్క్ చేయడమంటే కేవలం మొక్కల పెంపకం కోసం మాత్రమే కాదు. ఇది వారి సొంత మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోంది. నేలను చదును చేయడం, విత్తనాలు లేదా మొక్కలు నాటడం, నచ్చిన డిజైనింగ్‌లో కట్ చేయడం, తరచూ పచ్చదనం మధ్య గడపడం మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి.
ప్రకృతితో అనుబంధం
ప్రత్యేకించి మొక్కల(Succulents) మెయింటెనెన్స్ నేచర్, అద్భుతమైన అందంతో అనేక మంది మిలీనియల్స్ హృదయాలను దోచుకుంటోంది. ఈ స్థితిస్థాపక మొక్కలు వివిధ వాతావరణాలలో వృద్ధి చెందుతాయి. పట్టణ ప్రాంతాల్లో లేదా బిజీ షెడ్యూల్స్ మధ్య నివసించే వారు తమ గార్డెన్‌లో పెంచడానికి అనుకూలమైనవిగా చెప్తారు. వీటిని మట్టిలో, అలాగే కుండీల్లోనూ పెంచవచ్చు. వీటిని పెంచడం, జాగ్రత్తగా చూసుకోవడం మానసిక శ్రేయస్సుపై సానుకూలప్రభావాన్ని చూపుతుందని, ప్రకృతి, జీవిత చక్రంతో అనుబంధాన్ని పెంపొందిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా గార్డెనింగ్ పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.
బెనిఫిట్స్ ఇవే..
తోటపనిలో నిమగ్నం కావడంవల్ల స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మొక్కలు నాటడానికి లేదా గార్డెనింగ్ క్లీన్ చేయడానికి మట్టిని త్రవ్వడం వల్ల సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్ హార్మోన్ రిలీజ్ అవుతుందట. ఇది మానసిక ఆనందం, విశ్రాంతి యొక్క భావాలను ప్రోత్సహిస్తుంది. అదనంగా గార్డెనింగ్‌లో టైమ్ స్పెండ్ చేయడంవల్ల మిలీనియల్స్ సహజమైన సూర్యకాంతికి గురవుతారు. విటమిన్ డి లెవల్స్ సమతుల్యతకు ఇది దోహదం చేస్తుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతర శారీరక వ్యాయామాలు చేయడంవల్ల కలిగె అన్ని హెల్త్ బెనిఫిట్స్ గార్డెనింగ్ వల్ల కలుగుతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, కార్డియో వాస్క్యులర్ ఇష్యూస్, గుండెజబ్బులు వంటివి రాకుండా ఉంటాయి.