అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా జరిగిన విగ్రహావిష్కరణలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘చిన్నతనం నుంచి ఏ విగ్రహం చూసినా, ఆ వ్యక్తి లేరు కనుకే విగ్రహం ఉంది అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు నాన్నగారి విగ్రహాన్ని వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించారు. ఆవిష్కరించే ముందు వరకు నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. ఎందుకంటే చూస్తే నాన్నగారు లేరు అని నేను యాక్సెప్ట్ చెయ్యాలి. ఈ విగ్రహాన్ని వినీత్ అద్భుతంగా చెక్కారు. మీ అందరికీ తెలిసిన ఎఎన్నార్‌గారు రివార్డులు, అవార్డులు, భారతదేశం ఎన్నో రకాలుగా సత్కరించిన ఆర్టిస్ట్, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్ల మంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్నగారు మా గుండెల్ని ప్రేమతో నింపిన వ్యక్తి. నాకే కాదు, నా తోబుట్టువులు, నా పిల్లలను చల్లగా చూసిన వ్యక్తి. ఆయన ఇంటికి వెళ్లినపుడల్లా మమ్మల్ని చిరునవ్వుతో పలకరించే వ్యక్తి నాన్నగారు. మాకు మనసు బాగున్నా, బాగాలేకపోయినా ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయనతో కాసేపు కూర్చుంటే అన్నీ సర్దుకుపోయేవి. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నగారికి ఎంతో ఇష్టమైన ప్లేస్. ఇష్టమైన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్టు అంటారు. ఆయన అలాగే ప్రాణంతో ఉన్నారని, మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాం. ఎఎన్‌ఆర్ లివ్స్ ఆన్ ఇన్ మై మైండ్, అండ్ ఎవ్రిబడీస్ మైండ్’’ అన్నారు.