తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ వ్యక్తి, తన కుటుంబానికే చెందిన వదిన, ఆమె ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుపతికి చెందిన మోహన్ సాఫ్ట్ వేర్ ఉద్యోది. 2019లో ఇతడికి వివాహమైంది. అయితే ఏడాదికే భార్యాభర్త విడిపోయారు. అప్పట్నుంచి మోహన్ అన్నయ్య దాసు, వదిన సునీత ఇతడికి సంబంధాలు చూస్తున్నారు.
అలా గతేడాది మోహన్ కు రెండో పెళ్లి చేశారు. అయితే దురదృష్టవశాత్తూ అది కూడా నిలవలేదు. ఆ అమ్మాయి కూడా మోహన్ ను వదిలి వెళ్లిపోయింది. దీంతో మోహన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అన్న-వదినలు తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని కోపం పెంచుకున్నాడు.
నిన్న రాత్రి మోహన్-దాసు ఇద్దరూ ఇంట్లోనే మద్యం సేవించారు. కొద్దిసేపటికి అన్న దాసు బయటకు వెళ్లాడు. అదే టైమ్ లో మోహన్, ఇంట్లో ఉన్న వదినను, ఆమె ఇద్దరు కుమార్తెలను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా వేరే గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటికొచ్చిన దాసు జరిగిన ఘటన చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాసు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇష్టంలేని పెళ్లి చేయడం వల్లనే మోహన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాధమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
The post ఇష్టంలేని పెళ్లి.. సామూహిక హత్యలు appeared first on Great Andhra.