వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డేనని.. వైసీపీ ప్రభంజనం ఖాయమని న్యూస్ ఎరీనా అనే సంస్థ తేల్చింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తున్నట్టు ఈ సంస్థ తేల్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రిపోల్ సర్వే అధికార పార్టీలో మాత్రం జోష్ నింపుతోంది. ఈ సర్వే ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వై నాట్ 175 అంటూ ఉవ్విళ్లూరుతున్న వైసీపీకి ఇది చాలా బూస్ట్ ఇచ్చింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గుతాయని వెల్లడించింది.
టీడీపీ-జనసేన కూటమికి 53 స్థానాల్లో విజయం..
న్యూస్ ఎరీనా సంస్థ డిసెంబర్ 1, 2023 నుంచి జనవరి 12, 2024 తేదీ వరకూ సర్వే నిర్వహించింది. 175 స్థానాలకు గానూ.. వైసీపీ 122 స్థానాల్లో విజయం సాధిస్తుందట. ఇక టీడీపీ-జనసేన కూటమి 53 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక ఓటు శాతం విషయానికి వస్తే వైసీపీ 49.14 శాతం ఓటింగ్‌ను సాధించగా.. టీడీపీ – జనసేన 44.34 శాతం.. కాంగ్రెస్ 1.21 శాతం, బీజేపీ 0.56 శాతం ఓట్లను సాధిస్తుందని న్యూస్ ఎరీనా సర్వే వెల్లడించింది. ఈ సర్వే లెక్క ప్రకారం జగన్ రెండోసారి అధికారం చేపట్టడం ఖాయంగానే కనబడుతుంది.
ఇక ఈ సర్వే రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రభుత్వం అందించిన సేవలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఎమ్మెల్యేల పనితీరు, మూడు రాజధానులు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, టీడీపీ-జనసేన పొత్తు వంటి అంశాలను ఎజెండాగా తీసుకుని నిర్వహించినట్టు న్యూస్ ఎరీనా తెలిపింది. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి మైలేజ్ తెచ్చిందా? టీడీపీ-జనసేన పొత్తు జనాలకు నచ్చలేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.