విశాఖ స్థాయీ సంఘం ఎన్నికలు వైసీపీను అతి పెద్ద సవాల్ గా మారుతున్నాయి. జీవీఎంసీలో ఏ మాత్రం బలం లేని టీడీపీ కూటమి ఫిరాయింపులు నమ్ముకుంది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి 12 మంది దాకా కార్పోరేటర్లు ఇప్పటికే కూటమిలో చేరిపోయారు. మరికొందరి ఈ వైపుగా చూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చి పడ్డాయి స్థాయీ సంఘం ఎన్నికలు. పది మంది స్థాయీ సంఘం సభ్యులను ఎన్నుకోవడానికి సంబందించిన ఈ ఎన్నికల్లో ఇరవై మంది పోటీలో ఉన్నారు. కూటమి నుంచి తీవ్రమైన పోటీ ఉంది.
దీంతో వైసీపీ అధినాయకత్వం ఎట్టకేలకు మేలుకుంది. అధినేత జగన్ పిలుపు మేరకు వైసీపీ కార్పోరేటర్లు అంతా తాడేపల్లి చేరుకున్నారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి గెలుపు ఎలా సాధించాలన్న దాని మీద జగన్ కార్పోరేటర్లకు దిశా నిర్దేశం చేశారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యతను వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీద పెట్టినట్లుగా తెలుస్తోంది. వైవీ ఎలా గెలిపించుకుని వస్తారో చూడాలని అంటున్నారు.
వైవీ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ అయ్యాక అన్నీ పరాజయాలే వెంటాడాయని అంటున్నారు. గత ఏడాది ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మొదలుపెడితే ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకూ సర్వం ఊడ్చిపెట్టుకుని పోయేంతగా వైసీపీ తీరు ఉంది. వర్గ పోరు హెచ్చింది. పట్టించుకునే నాధుడు లేడు, వైవీ సుబ్బారెడ్డి మీదనే విమర్శలు చేస్తూ చాలా మంది పార్టీ మారారు. ఇపుడు వైసీపీని వదిలి వెళ్తున్న కార్పోరేటర్లు కూడా వైవీ మీదనే విమర్శలు చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ బాబాయ్ ఈసారి అయినా వైసీపీని గెలిపించి ఒడ్డునకు చేరుస్తారా అన్న చర్చకు తెర లేచింది. వైవీ ఇపుడు ఉన్న సంక్లిష్టమైన పరిస్థితులలో వైసీపీకి విజయాన్ని అందిస్తే ఆయన సామర్థ్యాన్ని అంతా మెచ్చుకుంటారు. లేకపోతే వైసీపీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే అన్న డిమాండ్ అయితే తెర మీదకు వస్తుందని అంటున్నారు.
The post ఈసారైనా బాబాయ్ గెలిపిస్తారా? appeared first on Great Andhra.