posted on Sep 27, 2023 9:30AM
తొందరగా చనిపోవాలని ఎవరికీ ఉండదు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఎలాంటి శారీరక సమస్యలు లేకుండా హాయిగా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటి కారణంగా వందేళ్ల ఆయుష్షు గడవకముందే మరణిస్తుంటారు. గత కొన్నేళ్ళను గమనిస్తే మనిషి ఆయుష్షు క్రమంగా తగ్గుతూ వస్తోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కాలం ఎలా మారినా వందేళ్ళు హాయిగా బ్రతికేయచ్చు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు చాలా సులువుగా వందేళ్ళు బ్రతుకుతున్నారు. దీనికి కారణం వారు తింటున్న ఆహారం, వారి అలవాట్లు. అలాగని వారేదో నాన్ వెజ్ తిని పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే పొరపాటే. అసలు వారి అలవాట్లేమిటో, అవి వందేళ్ళ ఆయుష్షుకు ఎలా కారణమవుతాయో తెలుసుకుంటే..
వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నవారిలో 95శాతం ఆహారం మొక్కల ఆధారిత ఆహారమే. వీటిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, గింజలు మొదలైనవి ఉన్నాయి. ఆహారం విషయంలో కొన్ని పరిశోధనలలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మాంసాహారాన్ని మానేసి మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఇతర ప్రమాదకర వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. కాబట్టి మొక్కల ఆధారిత ఆహారం మనిషి ఆయుష్షును పెంచుతుంది.
ప్రతి మతంలోనూ ఉపవాసం అనేది ప్రధానంగా ఉంటుంది. ఉపవాసం శరీరంలో రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. అనేక వ్యాధులకు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కారణం అవుతుంది. అందుకే అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆకలి అనిపించినప్పుడు కడుపు నిండా తినడం చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఆహారాన్ని కేవలం 80శాతం మాత్రమే తినాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మధ్యపానం చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు. అయితే ధీర్ఘాయుష్షు కావాలంటే మధ్యపానం తీసుకోవాలి కానీ అది చాలా మితంగా ఉండాలట. ఆల్కహాల్ కూడా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ దీని మోతాదు ఎక్కువ కావడం, ఆల్కహాల్ సేవించడం ఒక వ్యసనంగా మాత్రం మారకూడదు.
ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారి శరీరం పర్ఫెక్ట్ గా పనిచేస్తున్న యంత్రంలాంటిది. శరీరంలో వివిధ అవయవాలు, వాటి పనితీరు వ్యాయామం వల్ల మెరుగవుతుంది. అంతేకాదు వ్యాయామం శరీరంలో కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు. ప్రతిరోజు కనీసం ఆరు నుండి 8 గంటలసేపు నిద్రపోవడం వల్ల రోజుమొత్తం పనిచేసిన శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. మంచి నిద్ర వల్ల గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయి.