ఈ కూటమి నాయకులకు ఏమైంది.. ఎస్ ఇలాగే అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏదో మానస సరోవరంలో మునక వేసి వచ్చినట్టు, పవిత్ర గంగాజలాన్ని సేవించినట్టు ప్రతి ఒక్క కూటమి నాయకులలో, నడవడికలో కనిపిస్తోన్న పరిణతి, పట్టుదల ఆశ్చర్య చకితులని చేస్తోంది. ఎన్నికలు జరగడం, పాలనా యంత్రాంగం మారడం కామనే కావొచ్చు కానీ.. ఈసారి మాత్రం చకచకా అడుగులేస్తూ ఒడిఒడిగా పనులు చేస్తూ పట్టుమని పది రోజులు కాకుండానే ప్రజల్లో అఖండ ఆదరణ చూరగొంటోంది కూటమి ప్రభుత్వం.
వేగం.. అమోఘం – చంద్రబాబు
ఏడు పదుల వయసులోనూ తన వేగం అమోఘం అనిపించుకుంటూ రోజుకి 18 గంటలు పని చేసే కార్యసాధకుడిగా దూసుకుపోతున్నారు చంద్రబాబు. పోలవరాన్ని సందర్శించారు, అమరావతిలో పర్యటించారు. క్యాబినెట్ మీటింగ్స్ అటెండ్ చేసారు. ఎమ్యెల్యేలకి, మంత్రులకి దిశానిర్దేశం చేసారు. ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలిచ్చారు. అవసరం పడ్డ సమయంలో నేరుగా తానే ప్రజల నుంచి వినతి పత్రాలను అందుకుంటున్నారు. ప్రతి చిన్న సమస్య పైనా దృష్టి సారిస్తున్నారు.
పద్దతి.. పటిమ – పవన్ కళ్యాణ్
ప్రజలు ఆదరించి అందించిన విజయాన్ని అహంకారంగా తీసుకోకుండా అధికారంగా భావించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే ఉపముఖ్యమంత్రి పవన్ కూడా సజావుగా అడుగులు వేస్తూ తనకు కేటాయించిన శాఖల కార్యనిర్వహణలో దూసుకుపోతున్నారు. వరసగా సమీక్షలు నిర్వహించడం పలు సమస్యలపై తనకున్న సందేహాలను లేవనెత్తడం పరిష్కారాలపై చర్చించడం వంటి అంశాలన్నీ ఒక ఎత్తైతే.. తన కోసం వచ్చిన ప్రజల కోసం కార్యాలయం ముందే కుర్చీ వేసుకుని కూర్చుని బాధితుల సమస్యలు వినడం తక్షణమే స్పందించడం ఆయన భావజాలానికి ప్రతీకగా అనిపిస్తోంది. ఈనాటి ప్రభుత్వ ప్రత్యేక ఇదే అనిపిస్తోంది.
వాడి.. వేడి – నారా లోకేష్
ఎత్తిన ప్రతి వేలు వెనక్కెళ్ళాలి.. లేచిన ప్రతి నోరు మూసుకోవాలి అనే రీతిలో, అదే మంగళగిరిలో అనూహ్యమైన మెజారిటీతో స్వయ సంకల్పంతో గెలిచిన నారా లోకేష్ లో కూడా ఏ మాత్రం అహంభావం లేకపోవడం ఆశ్చర్యకరం. ఎమ్యెల్యేగా ఎన్నికైన నాటి నుంచే ప్రజా దర్భార్ నిర్వహిస్తూ పలు సమస్యల పరిష్కారాలకు దారి చూపిస్తూ ప్రశంశలందుకుంటున్న నారా లోకేష్ నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం కూడా తనలో ఏ మాత్రం అహంకారం లేదని చాటుకున్నారు. తన కుర్చీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అదనపు అలంకారాలని స్వయంగా తన చేత్తోనే తీసేసి నేను మీలో ఒకడినే అంటూ సంభాషించారు, సామాన్యుడిగానే తన పయనమంటూ సంకేతమిచ్చారు.
జనం మెచ్చే ఈ ధోరణి.. జగన్ కి ఇక జాగా ఇవ్వదేమో!
ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట. ఏ నలుగురు కూర్చున్నా ఇదే ముచ్చట. పదే పది రోజుల్లో ఇంతటి ప్రజామోదం పొందిన ప్రభుత్వం బహుశా ఇదేనేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతి శాసన సభ్యుడు తన బాధ్యతల నిర్వహణకు పరుగులు పెడుతుంటే, ప్రతి మంత్రి తన శాఖ పట్ల సమగ్రంగా దృష్టి పెడుతుంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి-ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ డబుల్ ఇంజిన్ సర్కార్ ని దౌడ్ తీయిస్తుంటే ఆంధ్ర ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరడం తధ్యమనిపిస్తుంది. వీళ్ళిద్దరూ తలుచుకుంటే ఏదైనా సాద్యంలా కనిపిస్తుంది.