ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ యువ నేతగా, సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడిగా ఆయన అందరికీ సుపరిచితమే. అయితే అప్పట్లో ఆయన హీరోగా నటించాడనే విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.
2006 లో అనిల్ కుమార్ యాదవ్ ‘ఆంధ్రా స్టూడెంట్’ అనే సినిమాలో నటించాడు. కె.వి. రత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఎల్. వేణుగోపాల్ దర్శకుడు. అప్పట్లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రావడం విశేషం. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా రంగం తనకి అంతగా సెట్ కాదని భావించిన అనిల్ కుమార్.. తండ్రి బాటలోనే పయనిస్తూ కొంతకాలానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. 2015 నుండి 2020 వరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఆయనను.. 2023లో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అయ్యాడు. మొత్తానికి అనిల్ కుమార్ కి సినీ రంగం అంతగా కలిసి రాలేదు కానీ.. రాజకీయ రంగం మాత్రం బాగానే కలిసొస్తుంది.