శ్రీరాముని సాక్షిగా శ్రీకారం చుడతారా?మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర కీలక నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వెళుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఏకంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే వివిధ జిల్లాల్లో మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు వివిధ విభాగాల్లోని ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్ పార్టీలో విరివిగా చేరుతున్నారు. అయితే ఇప్పటి వరకు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతుండగా ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు చేరలేదు. కాగా తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి ఎమ్మెల్యేల చేరికకు ముహూర్తం పెట్టారా? అన్న సందేహానికి బలం చేకూరుతున్నట్లు కనిపిస్తోంది. గత ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేసిన భద్రాచలం శ్రీ రామచంద్రుని సాక్షిగానే ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుందా? అన్న ప్రచారం జరుగుతోంది. 11వ తేదీన భద్రాచలంలో కాలుమోపనున్న సీఎం రేవంత్ రెడ్డి శ్రీరామచంద్రుని దర్శనం అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతో పాటు పార్టీ పరమైన సమావేశంలోనూ పాల్గొననున్నారు. కాగా ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది. పొంగులేటితో కలిసి సీఎంను కలిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే భద్రాచలం(Bhadrachalam)లో సీఎం పర్యటన ఖరారు కావడం వెనుక పెద్ద ప్రణాళికే దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే భద్రాద్రి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatrao) కాంగ్రెస్ లో చేరే తొలి ఎమ్మెల్యే కానున్నారు.
Source link