ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే దానికి సమిష్టి కృషే కారణమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా హీరో ఇమేజ్, డైరెక్టర్ టాలెంట్ అనేవి సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతాయి. సమిష్టిగా కృషి చేసినా వరస పరాజయాల హీరో, డైరెక్టర్ వల్ల ఆ సినిమాకి ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు గానీ, నిర్మాత నష్టపోతాడు. తమకు ఎదురైన పరాజయాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళితే సక్సెస్ వరిస్తుందనే విషయాన్ని ఎంతో మంది జీవితాల్లో చూశాం. కానీ, కొంతమంది మాత్రం ఎన్ని జరిగినా తమ పంథా తమదే అన్నట్టు ఉంటారు. తమకు నష్టం చేకూర్చిన బాటలోనే ముందుకు వెళుతుంటారు. ఇప్పుడు అదే బాట శ్రీను వైట్ల వెళుతున్నాడేమో అనిపిస్తుంది.
1999లో రవితేజ హీరోగా ‘నీకోసం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శ్రీను వైట్ల ఇప్పటివరకు 17 సినిమాలను డైరెక్ట్ చేశాడు. అందులో ఎక్కువగా యాక్షన్, కామెడీ మిక్స్ అయిన సినిమాలే వుండడం విశేషం. డైరెక్టర్‌గా ఎన్నో సక్సెస్‌లు చూసిన అతని కెరీర్ గ్రాఫ్ ఒక దశలో దారుణంగా పడిపోయింది. శ్రీను వైట్ల సినిమా చేశాడంటే.. అది ఫ్లాపే అనే స్థితికి వచ్చేశారు అందరూ. ‘ఆగడు’ చిత్రంతో అతనికి ఫ్లాపులు మొదలయ్యాయి. ఆ తర్వాత చేసిన బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు వరసగా పరాజయాన్ని చవిచూశాయి. ఈ మూడు సినిమాల నిర్మాతలు ఎంతో నష్టపోయారు.
శ్రీను వైట్ల ఆ స్థితికి రావడానికి ముఖ్య కారణం.. తన ప్రతి సినిమా భారీగా ఉండాలని అనుకోవడమే. పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చెయ్యాలి అనుకోవడం వల్లే చిన్న సినిమాకు రాలేకపోయాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత 5 ఏళ్ళు సినిమా లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ‘ఢీ’ వంటి యాక్షన్ కామెడీ మూవీతో మంచు విష్ణుకి సూపర్‌హిట్ ఇచ్చాడు శ్రీను వైట్ల. అతను ఖాళీగా ఉన్న సమయంలో తనతో సినిమా చేస్తానని విష్ణు చెప్పడం, తర్వాత పక్కకు తప్పుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత శ్రీను వైట్లతో సినిమా చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు.
చాలా గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల శ్రీను వైట్ల ఎనౌన్స్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు చిత్రాలయం మూవీస్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చింది. అయితే గతంలో మంచు విష్ణు కూడా సినిమా చేస్తానని చెప్పడంతో ఎనౌన్స్‌మెంట్ కూడా అయింది. కానీ, సినిమా ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు గోపీచంద్ సినిమా కూడా అలాగే అవుతుంది అనుకుంటున్న తరుణంలో మొదటి షెడ్యూల్ యూరప్‌లో ప్రారంభమైందన్న న్యూస్ వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్ళడం వల్లే తనకీ పరిస్థితి వచ్చిందని గ్రహించని శ్రీను వైట్ల మళ్ళీ తన పాత దారిలోనే వెళుతున్నాడు. ఈ సినిమా కోసం మొదటి షెడ్యూలే యూరప్‌లోని మిలాన్‌లో ప్లాన్ చేయడంతో శ్రీను వైట్ల ఇంకా మారలేదంటున్నారు నెటిజన్లు, ఇకనైనా భారీతనంపై దృష్టి పెట్టకుండా కంటెంట్ విషయంలో కేర్ తీసుకుంటే అతనికి మళ్ళీ పూర్వ వైభవం తప్పకుండా వస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న గోపీచంద్ కూడా వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు. అతనికి కూడా ఒక సూపర్‌హిట్ కావాలి. శ్రీను వైట్లకు తప్పనిసరి హిట్ కావాలి. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా వారికి ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.