ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ‘దేవర'(Devara) సినిమా వాయిదా పడే అవకాశముందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ‘దేవర’ నిజంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో ఎన్నికలు ఉండటంతో పాటు, వీఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం అవసరం కావడం, పాటల రికార్డింగ్ పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. అంతేకాదు మేకర్స్ కొత్త డేట్ ని కూడా లాక్ చేశారట. ‘పుష్ప-2′(Pushpa 2) రిలీజ్ డేట్ పై ‘దేవర’ టీం కన్నేసిందట.
ఉగాది, శ్రీరామ నవమి వంటి పండగలు, పబ్లిక్ హాలిడేస్ కలిసొచ్చేలా అదిరిపోయే రిలీజ్ డేట్ ఏప్రిల్ 5ని ‘దేవర’ టీం మొదట ఎంపిక చేసింది. ఈ డేట్ కి వస్తే సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే అలాంటి మంచి డేట్ ని కొన్ని కారణాల వల్ల మిస్ చేసుకుంటోంది ‘దేవర’. అయితే ఆ డేట్ మిస్ అయినప్పటికీ.. మరో మంచి డేట్ దొరికిందని తెలుస్తోంది.
ఇండిపెండెన్స్ డే హాలిడేతో నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఉన్న ఆగస్టు 15వ తేదీకి ‘దేవర’ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. అయితే ఆ తేదీకి రాబోతున్నట్లు గతంలో ‘పుష్ప-2’ టీం ప్రకటించింది. కానీ ఇప్పుడు ‘పుష్ప-2’ ఆ డేట్ కి వచ్చే అవకాశమే లేదు అంటున్నారు. నటుడు జగదీశ్ అరెస్ట్ సహా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉంది. దానికి తోడు పార్ట్-2 కాబట్టి.. ఆ అంచనాలకు తగ్గట్టుగా, ఏ మాత్రం కంగారు పడకుండా కాస్త ఆలస్యమైనా మంచి అవుట్ పుట్ ఇవ్వాలని చూస్తున్నారట. అందుకే మేకర్స్ డిసెంబర్ కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి.
ఇక ‘దేవర’ ఆగస్టుకి వాయిదా పడుతుండటంతో.. ఏప్రిల్ 5 తేదీపై ఇతర సినిమాలు కన్నేస్తున్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలు ఆ డేట్ కి రావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.