<p>ప్రపంచకప్ ముందు భారత క్రికెట్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. ఆసియా కప్ గెలిచిన జోష్ లో ఉన్న టీమిండియా…ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లోనూ ముందంజ వేసింది. మొహాలిలో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. వన్డేలు, టెస్టులు, టీ20 ఫార్మాట్లలో టీమిండియా, ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానానికి కైవసం చేసుకుంది. 115 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి…భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. 111 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో ఇంగ్లాండ్‌ నిలిచాయి. </p>
<p>వరల్డ్‌ కప్ ముందు వన్డే సిరీస్‌ ఆడుతున్న భారత్‌, తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. మొదటి వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు, 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో భారత్ 48.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐదు వికెట్లు పడగొట్టి…భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమీకి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. </p>
Source link