తమ అభిమాన హీరో ఎక్కువ సినిమాలు చెయ్యాలని, ప్రేక్షకులకు చక్కని వినోదం అందించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. పాతతరం టాప్ హీరోలందరూ ఒక సంవత్సరంలో లెక్కకు మించిన సినిమాలు చేసేవారు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కొందరు హీరోల సినిమాలు నెలకి ఒకటి చొప్పున రిలీజ్ అయ్యేవి. రాను రాను ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. సంవత్సరానికి ఒక్క సినిమా చెయ్యడమే గగనంగా మారిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరి పరిస్థితి అలాగే ఉంది. అయితే ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 2018లో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలైంది. 2022లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ అయింది. ప్రస్తుతం ‘దేవర’ చిత్రం చేస్తున్నారు ఎన్టీఆర్. మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పైనే ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ‘దేవర’ చిత్రం విడుదల కానుంది. 2018 నుంచి 2024 వరకు అంటే 6 సంవత్సరాల్లో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా మాత్రమే విడుదలైంది. ఈ విషయంలో తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఎన్టీఆర్‌ను కంపేర్ చేస్తున్నారు అభిమానులు.
తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కెరీర్ ఎన్టీఆర్‌కి భిన్నంగా సాగుతోంది. 2018లో విజయ్ సేతుపతి 25వ సినిమా ‘సీతాకత్తి’ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఈ ఆరేళ్ళ కాలంలో 25 సినిమాలు పూర్తి చేసారు విజయ్. ఇటీవల అతను నటించిన 50వ సినిమా ‘మహరాజ’ రిలీజ్ అయింది. అంటే అంత వేగంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాలోని తన క్యారెక్టర్ నచ్చితే చాలు.. అది చిన్న క్యారెక్టరా, పెద్ద క్యారెక్టరా అనేది ఆలోచించరు. విలన్‌గా నటించడానికి కూడా వెనుకాడరు. అందుకే శరవేగంగా 50 సినిమాలు పూర్తి చేయగలిగారు విజయ్. ఒక విధంగా విజయ్ సేతుపతి కంటే ఎన్టీఆర్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎన్టీఆర్ ఇమేజ్ వేరు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో బిజినెస్ స్పాన్ కూడా బాగా పెరిగింది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ మూవీ ‘వార్2’లో నటిస్తున్నారు. విజయ్ సేతుపతిలా సంవత్సరానికి ఐదారు సినిమాలు చేయలేకపోయినా కనీసం రెండు సినిమాలైనా చేస్తే బాగుంటుందనేది అభిమానుల ఒపీనియన్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చర్చ బాగానే జరుగుతోంది. విజయ్ సేతుపతితో ఎన్టీఆర్‌ని కంపేర్ చెయ్యడమేంటి అని కొందరు కామెంట్ చేస్తుంటే.. అతను పాత తరం హీరోల మాదిరిగానే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేస్తున్నాడని, అతనిలా మన హీరో ఉండాలని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చెయ్యడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా ఫర్వాలేదు గానీ, ‘దేవర’ చిత్రానికి కూడా మూడేళ్ళు కేటాయించడం యంగ్ టైగర్ అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తోందట.