జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరుంది. ఎంత పెద్ద డైలాగ్ అయినా, కష్టమైన డ్యాన్స్ స్టెప్ అయినా ఒక్కసారి చూసి నేర్చేసుకుంటాడని ఆయనతో పనిచేసిన వాళ్ళు చెబుతుంటారు. తాజాగా యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర’ (Devara) సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. మరోవైపు జాన్వీ నటించిన హిందీ చిత్రం ‘ఉలాజ్’ ఆగష్టు 2న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ ని, దేవర టీంని పొగడ్తలతో ముంచెత్తింది.
“తెలుగువారి వర్కింగ్ స్టైల్ నాకిష్టం. వారు సినిమాని గౌరవిస్తారు. హుందాగా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్నా. ఆయన ఎనర్జిటిక్ హీరో. సెట్ లోకి రాగానే కళ వస్తుంది. ఎన్టీఆర్ సెట్ లో ఉంటే అందరూ ఉత్సాహంగా పనిచేస్తారు. ఇటీవల మా ఇద్దరిపై ఓ సాంగ్ షూట్ చేశారు. ఆయన డ్యాన్స్ స్పీడ్ చూసి ఆశ్చర్యపోయాను. దేన్నైనా ఒక్క సెకన్ లోనే నేర్చుకోగలరు. అదే విషయాన్ని నేర్చుకోవడానికి నాకు పది రోజులు పడుతుంది. నెక్స్ట్ సాంగ్ కోసం ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక డైరెక్టర్ కొరటాల శివ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా కూల్ గా ఉంటారు. ఆయనతో కలిసి పని చేయడం సులభం.” అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.