PM Modi : తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇందూరు జనగర్జన సభలో మాట్లాడిన ప్రధాని… బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ దిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారన్నారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ అడిగారని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాచరికం కాదని కేసీఆర్ కు చెప్పానని, ప్రజలు ఆశీర్వదించిన వాళ్లే పాలకులని చెప్పానన్నారు. ఈ తర్వాత ఎన్నడూ కేసీఆర్ తననను కలవలేదన్నారు. నా కళ్లలోకి చూసి ధైర్యం కేసీఆర్ లేదని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందన్నారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు మాత్రమే ధనికులయ్యారని పేర్కొన్నారు.