దిశ, ఫీచర్స్: ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. ఇక్కడ తెలుగు అని మాత్రమే కాదు, మాతృభాషపై ఆయనకున్న ప్రేమను కూడా చాటారు. ‘నీకు వచ్చిన భాషలో రాయి, నచ్చిన తీరుగ రాయి, ప్రజల కోసం రాయి, ప్రజల భాషలో రాయి’ అంటూ మాతృ భాషను భావాలుగా మల్చుకొని, అక్షరాలుగా అల్లితే ఎంత గొప్పగా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఒకానొక సందర్భంలో ప్రముఖ ప్రజా వాగ్గేయ కారుడు, దివంగత గద్దర్ కూడా అభివర్ణించారు. ఎంతో మంది కవుల నోటి నుంచి జాలువారే పాటలు, మాటలు కూడా మాతృభాష సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తుంటాయి. నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా అటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం.
తీనెకన్నా తీయనిది
చరిత్రలో మాతృ భాషకున్న స్థానం తక్కువేం కాదు. ఎన్ని మైళ్ల దూరమైనా సరే.. ఆరంభం మాత్రం మొదటి అడుగుతోనే వేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత గొప్పస్థాయికి ఎదిగినా మీ సక్సెస్‌కు ప్రధాన కారణం అమ్మ భాష మాత్రమే. అందుకే అంటారు ‘ప్రతి ఒక్కరికీ మొదటి బడి అమ్మ ఒడి’ అని. అమ్మ లాలనలోని వాత్సల్యం, ప్రేమ, అనురాగం, అనుబంధం అన్నీ రంగరించిన తీయనైన తీనె మాతృ భాష.
జ్ఞానానికి పునాది అదే
ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన నేటి ఆధునిక కాలంలో అనేక భాషలు విరాజిల్లుతున్నాయి. ముఖ్యంగా ఆంగ్ల భాష నేడు అందరికీ ఒక అవసరంగా మారిపోయింది. అయితే ఆ భాష నేర్చుకోవడానికి కూడా మాతృభాషే పునాదిగా ఉంటుంది. ప్రతి సందర్భాన్ని, సన్ని వేశాన్ని పుట్టినప్పటి నుంచి మనం మాతృ భాషలోనే గ్రహించి, స్వీకరించిన కారణంగానే జ్ఞానం అలవడుతుంది. ఆ జ్ఞానమే ఏదైనా నేర్చుకోవడానికి కారణం అవుతుంది. అందుకే ఏ భాషలు నేర్చుకున్నా మాతృభాషకున్న ప్రాధాన్యత తగ్గదు. అందుకే అమ్మను, అమ్మ భాషను గౌరవించని జీవితం వృథా అంటుంటారు పెద్దలు. అంతేకాదు కొన్ని అంతర్జాతీయ పోకడల నేపథ్యంలో మాతృభాషను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాం.
తొలి అడుగు పడిందిలా..
ప్రతి సంవత్సరం ఫిబ్రరి 21న మాతృ భాష దినోత్సవంగా జరుపుకోవాలన్న ఆలోచన 2000 సంవత్సరం నుంచి ఆచణలోకి వచ్చింది. ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని జరుపుకోవాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ కూడా ప్రకటించారు. ఏ భాష గొప్పతనం ఆ భాషదే. కాబట్టి ప్రపంచంలో అన్ని భాషలను రక్షించుకోవాలని, విభిన్న భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవాలని యునెస్కో పేర్కొంటున్నది. భాషాపరమైన స్వేచ్ఛ, సమానత్వం, స్థిరమైన అభివృద్ధి అందరికీ అవసరమని చెప్తోంది. ప్రస్తుతం ప్రపచంలో మొత్తం ఆరు వేల భాషలు ఉండగా, మన దేశంలో 1,652 మాతృ భాషలు ఉన్నాయి. వీటిలో 16 భాషలకు మాత్రమే లిపి ఉంది. 200 భాషలకు విభిన్న మాండలికాలు కూడా ఉన్నాయి. మాతృభాష అంతరించి పోకుండా కాపాడుకోవడమే మన కర్తవ్యంగా అందరూ భావిస్తే అమ్మ భాష కమ్మదనం పరిఢవిల్లుతుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు.