స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే అభిమానుల హడావుడి ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఒకే కాంపౌండ్ కి చెందిన నలుగురు స్టార్ హీరోల సినిమాలు.. ఐదు నెలల వ్యవధిలో విడుదలైతే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. త్వరలో మెగా అభిమానులు అలాంటి సినిమా పండుగనే చూడబోతున్నారు.
మెగా జాతర ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలుకానుంది. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘పుష్ప-2’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప-1’తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించిన బన్నీ-సుకుమార్.. ‘పుష్ప-2’తో అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి ఆగస్టు 15న రాబోతున్నారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాకి తగ్గ వసూళ్లు రాబట్టగల మూవీ ఇదని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన దానిని బట్టి.. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ భారీ బడ్జెట్ సినిమాకి మల్లిడి వశిష్ట దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇలా ఐదు నెలల సమయంలో మెగా కాంపౌండ్ నుంచి నాలుగు భారీ సినిమాలు రానున్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్నవే. మరి ఈ మెగా సినిమా జాతర ఫ్యాన్స్ ఏ రేంజ్ కిక్ ఇస్తుందో చూడాలి.