రాజకీయ నాయకులు ఏ విషయంలోనైనా తాము శుద్దపూసలమని, తాము తప్పులు చేయమని మాట్లాడతారు. ఎదుటివాళ్లే తప్పులు చేసి తమ మీద తోసేస్తారు అన్నట్లుగా మాట్లాడతారు. ఇప్పుడు గులాబీ పార్టీ పెద్దలు మాట్లాడుతున్నది ఇదే. పెద్దలంటే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రధానంగా కొడుకు కేటీఆర్ అండ్ మేనల్లుడు హరీష్ రావు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన తప్పులనండి, కుంభకోణాలనండి, పాపాలనండి …అవన్నీ బయటకు తీస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో కేసీఆర్ అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్న, ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలమయమని భావించిన కాంగ్రెస్ సర్కారు దానిపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించిన సంగతి కూడా తెలిసిందే.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లు, అధికారులు అందరూ కేసీఆర్ చెప్పినట్లే తాము చేశామని, తమ సూచనలు, సలహాలు ఆయన పట్టించుకోలేదని కమిషన్ కు చెప్పారు. ఈ మేరకు అఫిడవిట్లు కూడా ఇచ్చారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి లేదా దెబ్బ తినడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేటీఆర్ కుమారుడు కేటీఆర్ చెప్పాడు.
అసెంబ్లీ ఎన్నికల ముందే మేడిగడ్డ లోపాలు బయటపడటం ఏమిటని ప్రశ్నించాడు. ప్రభుత్వంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నాడు. పిల్లర్లు కుంగిపోయేటట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వమే కుట్ర చేసి ఉంటుందని అన్నాడు. ప్రభుత్వంలోని ఒకరిద్దరు మంత్రులు బరాజ్ ను ఏమైనా చేయగలరని, వారెవరో తనకు తెలుసని అన్నాడు. తాము మంచిగానే, గట్టిగానే బరాజ్ లు నిర్మించామని, తమ తప్పు ఏమీ లేదన్నట్లుగా మాట్లాడాడు.
ఈ ప్రాజెక్టును కేసీఆర్ కట్టాడు కాబట్టే ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని అన్నాడు. అందుకే రిపేర్లు కూడా చేయడం లేదని అన్నాడు. తాము శుద్దపూసలమని, కాంగ్రెస్ వాళ్ళే మాయగాళ్లని అంటున్నాడన్న మాట. అయినా ఒకరిద్దరు మంత్రులు బరాజ్ కుంగేటట్లు చేయగలరా? ఆ మంత్రులు ఎవరికీ తెలియకుండా మేడిగడ్డకు వెళ్లి దాన్ని పాడు చేశారా? ఇదేమైనా సినిమానా? గులాబీ పార్టీ నాయకులు ప్రజలు పిచ్చోళ్ళని అనుకుంటున్నారా? ఆరోపణలు చేస్తే అవి బలంగా, నమ్మే విధంగా ఉండాలిగాని చందమామ కథ మాదిరిగా ఉంటే ఎలా?
The post ఒకరిద్దరు మంత్రులు బరాజ్ ను ఏమైనా చేయగలరా? appeared first on Great Andhra.