రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడానికి అనేక హామీలు ఇస్తుంటారు. ఏ వర్గాలకు ఎలాంటి హామీలు ఇస్తే ఓట్లు పడతాయో స్టడీ చేస్తారు. ఆ వర్గాలను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన హామీలు ఇస్తారు. ఆ హామీల అమలులో వచ్చే కష్టనష్టాల గురించి వాటిని ఇచ్చేటప్పుడు ఆలోచించరు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ఆలోచించరు. మనకు చాతనవుతుందా లేదా అనేది ఆలోచించరు.
వాళ్ళ మైండ్ లో ఎన్నికల్లో గెలవాలి అనే ఆలోచనే ఉంటుంది. ముందైతే గెలవాలి. గెలిచాక చూసుకోవచ్చు అనుకుంటారు. తెలంగాణలో గులాబీ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, దాన్ని క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ చేసుకోవడంతో సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. అనేక హామీలు ఇచ్చింది. అవి అమలుకు సాధ్యం అవునా, కాదా అనే చర్చ అక్కరలేదు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకటి. రైతులు చాలా కీలకమైన వర్గం కాబట్టి ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలంటే రుణ మాఫీ హామీ ప్రధానమైంది. గతంలో చాలా ప్రభుత్వాలు ఇచ్చిన హామీనే ఇది. సరే … ఆ ప్రభుత్వాలు అమలు చేశాయా? లేదా? అనే చర్చ అనవసరం. రేవంత్ రెడ్డి ఈ రుణ మాఫీ ఒకేసారి చేస్తానన్నాడు. అది కూడా ఆగస్టు 15 నాటికి.
రుణ మాఫీ చేయడం సాధ్యం కాదన్నాడు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. చేసి చూపిస్తానని అన్నాడు రేవంత్. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రేవంత్ రెడ్డి చాలా దేవుళ్ళ మీద ఓట్లు పెట్టాడు. ఒకేసారి రుణ మాఫీ చేయడం చరిత్రాత్మకమని, దేశంలో ఇప్పటివరకు జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారు.
సీన్ కట్ చేస్తే …ఒకేసారి అనేది మరుగున పడింది. దశలవారీ లేదా విడతలవారీ మాఫీ అనేది తెర మీదికి వచ్చింది. రెండు లక్షల్లో లక్ష రూపాయల మాఫీ జరిగిపోయింది. కానీ కొంతమంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అలా కావడానికి యేవో కారణాలు చెప్పారు. డబ్బులు గ్యారంటీగా పడతాయన్నారు.
సరే… అది వేరే కథ. ఈ నెల 31 నాడు లక్షన్నర జమ అవుతాయని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి తాను విదేశాల నుంచి వచ్చాక పడతాయన్నాడు. అంటే ఆగస్టులో అన్నమాట. కాబట్టి రైతు రుణ మాఫీ ఒకేసారి జరగలేదని అర్థమవుతోంది. దశలవారీగా అయినా రుణ మాఫీ అయింది కదా అంటారా. సరే …కానివ్వండి.
The post ఒకేసారి కాదు.. దశలవారీగానే! appeared first on Great Andhra.