రైతుల కష్టాలు, కన్నీళ్ళు, వారి క్షోభ ప్రధానాంశాలుగా రూపొందిన సినిమా ‘రాజధాని ఫైల్స్’. తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్, వాణివిశ్వనాథ్, దర్శకుడు భాను, నిర్మాత కంఠంనేని రవిశంకర్, ఇతర నటీనటులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కంఠంనేని రవిశంకర్ మాట్డాఉతూ ‘‘ఒక సామాజిక బాధ్యతతో సినిమా రంగానికి వచ్చాను. మనం తీసే సినిమా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకోవడం జరిగింది. నేను రైతు బిడ్డను. రైతులు పడుతున్న కష్టం, వారి వ్యధను చూసి నా వంతుగా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. మీడియాలో 24 ఏళ్ళ నుంచి వున్నాం. దానికి ఎక్స్‌టెన్షన్‌గా సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు రైతులు పడుతున్న బాధ చూశాం, వారి కష్టం చూశాం, వారి త్యాగం చూశాం. ఒక రైతు బిడ్డగా అది నాక్కూడా తెలుసు. ల్యాండ్ ఎక్విషన్ కారణంగా ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో ఆగిపోయాయో చూశాం.
అటువంటిది స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాల భూములను రైతులు ఇస్తే, దాన్ని హేళన చేస్తూ, ఆయా రైతులను క్షోభ పెడుతున్న అంశాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని రైతుల పక్షాన ఓ సినిమా తియ్యాలనుకున్నాం. ఈ సినిమా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. అక్కడ మాకు కనిపించింది రైతు కళ్లల్లో కన్నీళ్లు మాత్రమే. ఆ కన్నీళ్లు తుడిచే విధంగా మనం సమాజాన్ని చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా భాను సినిమా కోసం నిజంగా బ్లడ్ పెట్టాడు. సినిమా నేచురల్‌గా ఉండాలి, ప్రతి డైలాగ్ ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలని ఎంతో కేర్ తీసుకున్నాడు. ఈ సినిమా మేం మొదలు పెట్టి రెండేళ్ళవుతోంది. ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్ళు షూటింగ్ చేసిన సినిమా బహుశా మాదే అయి ఉంటుంది. కొంతమంది పేరున్న నటీనటులు వెనుకడుగు వేస్తే నా చిరకాల మిత్రుడు వినోద్‌కుమార్ ధైర్యంగా ముందుకొచ్చారు. అలాగే వాణి విశ్వనాథ్, అఖిల్, వీణ, అమృతా చౌదరి, అంకిత ఠాకూర్, స్పెషల్ క్యారెక్టర్ చేసిన వర్మ.. ఇలా సినిమా కోసం పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగీతం సమకూర్చిన మణిశర్మగారికి, పాటలు రాసిన రాంబాబుగారికి, సుద్దాల అశోక్‌తేజగారికి, గురుచరణ్‌గారికి ధన్యవాదాలు. అందరి కుటుంబాల్లో ఏదో ఒక తరంలో రైతు ఉండి ఉంటాడు. వారిని గుర్తు తెచ్చుకోండి. మీరందరూ బాధ్యతగా ఫీల్ అయి, ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.