దిశ, ఫీచర్స్ : బిజీ లైఫ్, స్టైల్ వల్ల చాలా మంది ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడికి లోనయ్యేంత సున్నితంగా మారారు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి ఎంతగానో పెరిగి ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తారు. ఒత్తిడికి గురైన వ్యక్తి తనలో సతమతమవుతూ ఉంటారు.
ఒత్తిడి మానసిక ఆరోగ్యం పైనే కాకుండా శారీరక ఆరోగ్యంపైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిరంతరం ఒత్తిడికి లోనవడం వల్ల అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. మీ మానసిక ఆందోళన నుంచి బయటపడేందుకు కొన్ని జీవనశైలిలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలని అంటున్నారు నిపుణులు. మరి ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబంతో సమయాన్ని గడపడం..
మీరు మానసికంగా ఒత్తిడికి గురైతే ఎక్కువగా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. కుటుంబం లేదా స్నేహితులతో సమయం గడపకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కూడా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కుటుంబంతో సమయాన్ని వెచ్చించండి.
మిమ్మల్ని మీరు పోల్చుకోకండి..
ఒక వ్యక్తి తనను తాను ఇతరులతో పోల్చుకోవడం ద్వారా చాలాసార్లు ఒత్తిడికి గురవుతారు. జీవితంలో ఏ సమయంలోనైనా వైఫల్యం రావచ్చు. అలాంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు మరొకరితో పోల్చుకుంటే ఒత్తిడి ప్రబలుతుంది.
ఆరోగ్యకరమైన దినచర్య..
ఒత్తిడిని వదిలించుకోవడానికి మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, ప్రతిరోజూ యోగా లేదా ధ్యానం చేయడం చాలా ముఖ్యం. దీనితో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర పోవాలి. మీరు మీ దినచర్యలో మార్పులు చేసుకుంటే, మీ మానసిక ఆరోగ్యంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.
వర్తమానంలో జీవిస్తారు..
కొంతమంది తమ భవిష్యత్తు గురించి చింతిస్తూ ప్రస్తుత సమయాన్ని వృధా చేసుకుంటారు. అతిగా ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడికి గురవుతారు. అలాంటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో జీవించాలి.