భారతీయ తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒలింపిక్స్ పతకాధారులకు కూడా కాసుల వర్షం కురుస్తూ ఉంది. భారతదేశానికి ఒలింపిక్స్ పతకం అనేది ఎంత అపురూపమో వేరే వివరించనక్కర్లేదు. ఇప్పటికి ఇండియా తరఫున ఒలింపిక్స్ మెడలిస్టులు వేళ్ల మీద లెక్కబెట్టదక్కిన స్థాయిలోనే ఉన్నారు. కొన్నేళ్ల కిందటి వరకూ ఒక్కో ఒలింపిక్స్ కు ఒక్క పతకం దక్కితేనే అదే ఘనత అన్నట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో కొంత మెరుగు!
అయితే ఇప్పటికీ ఇండియా ఒలింపిక్స్ పతకాల సాధానలో రెండంకెల సంఖ్యకు రీచ్ కాలేదు. బహుశా ఆ రికార్డు ఈ సారి పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ తో నయినా సాధ్యం అవుతుందేమో చూడాలి. అయితే ఈ కథనం రాసే సమయానికి ఇండియా తరఫున కంచులే మోగాయి. మూడు కాంస్య పతకాలతో ఇండియా పతకాల పట్టికలో 44 స్థానంలో ఉంది. ఈ పరిస్థితి ఎంత వరకూ మెరుగవుతుందో ఆటలు ముగిసే సమయం వరకూ వేచి చూడాలి. అయితే పతకాల విషయంలో ఆశలు రేపిన కొందరు ప్లేయర్లు ఇంటి ముఖం పట్టడం కాస్త నిరాశపూరితమైనది. ఆశలు పెట్టుకున్న వాళ్ల కన్నా.. కొందరు అండర్ డాగ్స్ ఇండియా పేరును పతకాల పట్టికలో ఎక్కించారు. వారికి సహజంగానే ప్రభుత్వాల నుంచి కోట్ల రూపాయల బహుమానాలు దక్కడం ఖాయం.
ఒలింపిక్స్ ముగిసే సమయానికి వారికి ప్రభుత్వాలు నజరానాలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కొన్ని బహుమానాలను వారికి వివిధ వైపుల నుంచి అందుతున్నాయి. ఒలింపిక్స్ నిర్వాహకులు వారికి ఇచ్చేది కేవలం పతకం మాత్రమే అయినా.. ఇండియాలో అయితే ఒలింపిక్ మెడలిస్టులు నిస్సందేహంగా హీరోలుగా కీర్తింపబడతారు. కనీసం ఈ కీర్తికి, వచ్చే బహుమానాలను దృష్టిలో ఉంచుకుని అయినా భారతీయులు తమ పిల్లలను స్పోర్ట్స్ లో ప్రోత్సహిస్తే మంచిదే!
ఇండియాలో ఇప్పటి వరకూ ఎక్కడా స్పోర్ట్స్ కు ప్రోత్సాహం ఉండదు. ఇంట్లో అయినా, స్కూళ్లో అయినా, కాలేజీలో అయినా.. మరెక్కడకు వెళ్లినా ఆటలు ఆడటం అనేది పనికిమాలిన పని అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. పిల్లలు సోమరిపోతుల్లా మారినా సహించే తల్లిదండ్రులు వారు ఏదైనా క్రీడల్లో ఉంటే మాత్రం తమ ప్రతాపం అంతా చూపిస్తారు. అయితే అర్బన్ లో కొంత పరిస్థితి మార్పు ఉంది. ప్రత్యేకించి కనీసం నగరాల వరకూ అయినా ఈ పరిస్థితిలో మార్పు ఉంది. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నారు.
అయితే అక్కడ కూడా క్రికెట్ కే ఎక్కువ ఆదరణ. తమ పిల్లలను క్రికెటర్లుగా చూడాలని కలలు గనే తల్లిదండ్రులు సిటీల్లో ఉంటారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. క్రికెట్ ను ఏ స్టేజీ మీద ఆడినా గ్లామర్ ఉంది. అలాగే డబ్బు సంపాదనకు కూడా మంచి అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో రంజీల్లో ఆడే క్రికెటర్లకు కూడా మంచి ఉద్యోగస్తుడికన్నా ఎక్కువ సంపాదన ఉంది. అక్కడ గనుక ప్రతిభ చూపించి ఐపీఎల్ వరకూ వెళ్లినా చాలు లైఫ్ సెటిల్ అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
రెండు మూడు సీజన్ల పాటు రాణించినా.. కొందరు దేశవాళీ ఆటగాళ్లు మంచి రేటు పొందుతూ ఉన్నారు. వారు కూడా కోట్ల రూపాయల్లో డబ్బు పొందుతూ ఉండటంతో.. క్రికెట్ వైపు వెళితే ఫర్వాలేదు అనే ధోరణి తల్లిదండ్రుల్లో కూడా ఏర్పడుతూ ఉంది. దీంతో కొందరు పిల్లలను క్రికెట్ కోచ్ ఇనిస్టిట్యూట్ లలో చేర్చడానికి కాస్తైనా ముందుకు వస్తున్నారు! ఆర్థికంగా సెటిలైన కుటుంబాల్లోని పిల్లలకు ఇప్పుడు ఇలా మంచి ప్రోత్సాహమే లభిస్తూ ఉంది. అయితే కేవలం కోచింగ్ కు చేరితే సరిపోదు బాగా కష్టపడాల్సి ఉండటం, నైపుణ్యం కూడా కీలక పాత్ర పోషిస్తాయి క్రీడల్లో. అందుకే ఇండియాలో క్రీడల పట్ల ఆసక్తి కనిపించదు.
జీవితానికి ఏదైనా ఆధారం కావాలి. అది చదువుతోనే ఎక్కువ మేర లభించే అవకాశం ఉంది. కనీసం డిగ్రీ పూర్తి చేస్తే ఏదో ఒక ఉద్యోగం, ఎంతో కొంత జీతం, దాంతోనే జీవితం అన్నట్టుగా ఉన్నాయి దేశంలో పరిణామాలు. వీటిల్లో ఇప్పుడే కాదు, ఎప్పటికీ మార్పు రాదు. చదువుల విషయంలో కూడా కాంపిటీషన్ రోజురోజుకూ పెరుగుతూ ఉంది. దీంతో ఏమాత్రం అశ్రద్ధ వహించినా కోరుకున్న చదువుకు కాలేజీలో సీటు కూడా లభించే అవకాశం లేదు.
ఇలాంటి నేపథ్యంలో ఎంతమంది స్పోర్ట్స్ ను నమ్ముకుని ప్రాక్టీస్ చేయగలరు అనేది ప్రశ్న! అయితే కొంతలో కొంత మేలు ఏమిటంటే.. క్రికెట్ యేతర స్పోర్ట్స్ లో కూడా ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. అక్కడా స్పాన్సర్లు కొంత వరకూ ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తూ ఉంది ఒలింపిక్స్ అసోసియేషన్ కోసం. కాబట్టి మరీ దారుణమైన పరిస్థితి ఉంటుందని భయాలు అక్కర్లేదు. అలాగే ఒక స్థాయి వరకూ రాణించినా ఎండోర్స్ మెంట్ డీల్స్ దక్కుతూ ఉంటాయి.
ఒలింపిక్స్ లో ఇప్పుడు రెండు పతకాలు సాధించిన అమ్మాయి యాడ్ డీల్స్ మొన్నటి వరకూ ఐదారు లక్షల రూపాయల వరకూ ఉండేవట, ఇప్పుడు అవి అమాతం కోటిన్నర వరకూ చేరాయని వార్తలు వస్తూ ఉన్నాయి.