గతేడాది ‘సామజవరగమన’తో నవ్వులు పంచి బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీ విష్ణు.. ఈ ఏడాది మరో కామెడీ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే ‘ఓం భీమ్ బుష్’. “నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్” అనేది క్యాప్షన్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
‘బ్రోచేవారెవరురా’ తర్వాత శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ త్రయం కలిసి నటిస్తున్న చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అందుకే చిత్ర ప్రకటనతోనే.. కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందనే అంచనాకి ప్రేక్షకులు వచ్చేశారు. పైగా ‘హుషారు’తో నవ్వులు పూయించిన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తోడయ్యాడు. ఇక తాజాగా విడుదలైన టీజర్ కూడా వీళ్ళ కాంబినేషన్ కి తగ్గట్టుగానే ఎంటర్టైనింగ్ గా ఉంది.
భైరవపురం అనే గ్రామానికి సైంటిస్ట్ లుగా అడుగుపెట్టిన శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. అక్కడ గుప్త నిధుల కోసం అన్వేషణ మొదలుపెడతారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు వినోదాన్ని పంచేలా ఉన్నాయి. “ఇది కింది స్థాయి వాళ్లకి కూడా అర్థమవుతుందని”, “మీ బ్రెయిన్ లు ఇంటిదగ్గర వదిలేసి వచ్చి.. ఈ మెంటల్ మూవీని ఎంజాయ్ చేయండి” అని టీజర్ లో చెప్పేశారు. ‘జాతిరత్నాలు’ మాదిరిగానే నవ్వించమే టార్గెట్ గా “నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్” అంటూ వస్తున్న ఈ మూవీ కూడా అదే స్థాయిలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
యూవీ క్రియేషన్స్ కి చెందిన వి సెల్యులాయిడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మార్చి 22న విడుదల ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది.