శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ త్రయం కలిసి వినోదాన్ని పంచిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం 2019 జూన్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ త్రయం మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి వస్తోంది. ఈసారి “నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్” అంటూ అలరించడానికి వస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ కి చెందిన వి సెల్యులాయిడ్ నుంచి తాజాగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ‘ఓం భీమ్ బుష్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. “నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్” అనేది క్యాప్షన్. ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు కావడం విశేషం.
‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ఏదో పెద్ద స్పేస్ సైంటిస్ట్స్ లాగా సూట్స్ వేసుకొని పల్లెటూరిలో చక్కర్లు కొడుతుండటం వెరైటీగా ఉంది. టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయడంతో పాటు.. ఈ సినిమాని మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. పక్కా ప్లానింగ్ తో సినిమాని కంప్లీట్ చేసి.. సరిగ్గా నెలరోజుల ముందు ప్రమోషన్స్ షురూ చేశారని చెప్పవచ్చు.
అసలే శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ త్రయం కలిస్తే కామెడీ అదిరిపోతుంది. దానికితోడు ‘హుషారు’తో నవ్వులు పూయించిన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తోడయ్యాడు. పైగా “నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్” అంటున్నారు. ఇదే తరహాలో నవ్వించడమే లక్ష్యంగా వచ్చిన ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ వంటి సినిమాలు బిగ్ సక్సెస్ అయ్యాయి. ‘ఓం భీమ్ బుష్’ కూడా అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి.