ఓటర్లు మీద ప్రజా ప్రతినిధులు నోరు చేసుకునేందుకు సాధారణంగా సాహసించరు. వారితోనే ఎపుడూ పని ఉంటుంది కాబట్టి. కానీ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఆ సాహసం చేశారు. విశాఖ నార్త్ కి చెందిన విష్ణు కుమార్ రాజు వైసీపీ మీద ఆగ్రహంతోనో కోపంతోనో ఓటర్ల మీద పడ్డారు. వైసీపీకి ఓట్లు వేసేవారు అన్నం తినే వేశారా అని ఆయన నిండు శాసన సభలో మాట్లాడడం నిజంగా విడ్డూరమే మరి.
ప్రజా స్వామ్య దేశంలో ఒకే పార్టీకి అంతా కలసి ఓట్లు వేయరు. ఎవరి అభిమానం వారిది. ఆఖరుకి ఓడిపోతారు అని తెలిసినా ఇండిపెండెంట్లకు ఓట్లు వేసే వారు కూడా ఉంటారు. అంత మాత్రం చేత వారి విజ్ఞతను ప్రశ్నించడం తప్పు మాత్రమే కాదు ప్రజాస్వామ్య స్పూర్తిని సైతం ప్రశ్నించడమే అని ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి.
వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని కూటమి ఎమ్మెల్యేలకు బాధ అయితే ఉండవచ్చు. కానీ వారికి ఆ పార్టీ నచ్చింది ఓట్లు వేశారు, మాకు ఓటు వేయండి అని అడగాలి తప్పు లేదు, వారికి ఎందుకు వేశారు అని అడగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే.
విష్ణు కుమార్ రాజుకు కూటమిలో మంచి కనిపించి ఉండొచ్చు. ఆయన కూటమి సభ్యుడు కనుక. ప్రజలు అలా ఎందుకు అనుకుంటారు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలోనూ ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీకి ఓట్లు పడ్డాయి కదా. అన్ని ఓట్లూ తమకే వేయాలని విష్ణు కుమార్ రాజు వాదించే వాదన అసంబద్ధంగా ఉంది. అంతే కాదు ఒటర్లను పట్టుకుని అన్నం తింటున్నారా అని ప్రశ్నించడం అంటే అధికారంలో ఉండే వారి తీరు ఇలాగే ఉంటుందేమో అనిపించేలా ఉంది.
కూటమి పెద్దల కనుసన్నలలో పడాలని చేసే తాపత్రయంలో ఇలాంటి వాగాడంబర ప్రదర్శన చేయడం ద్వారా ప్రజాస్వామ్య హితానికి తాము మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా తెలుసుకుంటే మంచిదని అంటున్నారు. విష్ణు కుమార్ రాజు బీజేపీకి చెందిన వారు అయినా ఆయన చంద్రబాబును ఇష్టపడతారు అని అంతా అంటారు. అందులో తప్పేమీ లేదు. ఆయనకు బాబు లీడర్ షిప్ క్వాలిటీస్ నచ్చి ఉండొచ్చు. అంతమాత్రం చేత ఓటర్లను నిందిస్తూ బాబుకు వేయని వారు అంతా అన్నం తినని వారుగా చిత్రీకరించాలనుకోవడం బాధాకరమే.