అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప మనదేశంలో సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతూ ఉంటుంది. ఓటింగ్ పెంచడానికి ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అయితే పంచాయితీ సర్పంచ్ ఎన్నికలకు నమోదైన పోలింగ్ శాతం ఎమ్మెల్యే ఎన్నికలకు ఉండదు.
ఎంపీ ఎన్నికలు విడిగా జరిగితే గనుక పోలింగ్ శాతం ఇంకా పడిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓటు వేసే విధానాన్ని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉంది.
అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే 80 ఏళ్లు దాటిన వృద్ధులు తమ ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా కర్ణాటక ఎన్నికలలో అమలు చేశారు. సత్ఫలితాలు లభించాయి. అంతకుముందే నాగార్జునసాగర్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా అమలు చేశారు. ఈ పద్ధతిలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోవాలని అనుకుంటే గనుక, ముందుగా లిఖితపూర్వకంగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్నికల అధికారులు ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. దీని వలన వయసు పైబడిన వృద్ధులు పోలింగ్ కేంద్రం వరకు వచ్చే శ్రమ తీసుకోవడానికి ఇబ్బంది పడి ఆగిపోకుండా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వయో వర్గంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
కేవలం వృద్ధులలో ఓటింగ్ శాతం పెంచే ఆలోచనలు మాత్రమే కాకుండా.. ఓటింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేయడం గురించి ఎన్నికల సంఘం కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. సాంకేతికత కొత్త రూపాలు సంతరించుకుంటున్న కొద్ది.. లక్షల, కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు సైతం ప్రజలు ఇంటిలో కూర్చుని కంప్యూటర్ లేదా మొబైల్ ఫోను ద్వారా చేసేస్తున్న రోజులు ఇవి. పటిష్టమైన మల్టీ లేయర్ సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసి ఓటర్లు ఎవరైనా సరే తమ ఇంటి నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం ద్వారా ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచడం సాధ్యమవుతుంది.
ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసే చట్టసభ ప్రతినిధి ఎవరిని నిర్ణయించడానికి.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములు కావాలంటే గనుక.. ఈ ప్రక్రియను సరళతరం చేయాల్సిన అవసరం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.కేవలం సెలబ్రిటీలతో తప్పకుండా ఓటు వేయాలని ప్రచారం చేయించినంతమాత్రాన ఓటింగ్ శాతం పెరగదని అంటున్నారు.