ఒక సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత దాని గురించి చిత్ర యూనిట్ అప్‌డేట్స్ ఇవ్వడం సాధారణమైన విషయమే. కానీ, ఇటీవల ఓ సినిమా గురించి వచ్చినన్ని అప్‌డేట్స్ మరే సినిమాకీ రాలేదంటే అతిశయోక్తి కాదు. సినిమాను ఎంతో వేగంగా జనంలోకి తీసుకెళ్ళాలన్న ఆలోచనతోనే చిత్ర యూనిట్ అలా చేస్తోందని అర్థం చేసుకోవాలి. రూ.100 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎన్నో అప్‌డేట్స్ వచ్చాయి. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం.
ఈ సినిమాలో ఇప్పటికే హేమాహేమీల వంటి నటీనటులు పాలుపంచుకుంటున్నారు. వారిలో పాన్ ఇండియా హీరో ప్రభాస్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, లేడీ సూపర్‌స్టార్ నయనతార, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, శరత్‌కుమార్ వంటి మేటి స్టార్లు ఉన్నారు. భారీస్థాయిలో, హై టెక్నికల్ వేల్యూస్ ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తున్న స్టార్లంతా కేమియోలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కన్నప్ప టైటిల్ రోల్‌ను మంచు విష్ణు పోషిస్తున్నాడు. అతని చుట్టూ తిరిగే కథ కావడంతో అప్పుడప్పుడు వచ్చి పలకరించే పాత్రల్లో ఈ స్టార్లంతా కనిపిస్తారు.
ఇప్పుడు కొత్తగా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ రంగంలోకి దిగుతున్నాడు. అక్షయ్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన ‘బడే మియా ఛోటే మియా’ చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే అక్షయ్ ‘కన్నప్ప’ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ వంటి ప్రముఖ రచయితలు ఈ సినిమాకి స్క్రిప్ట్‌ను, డైలాగ్స్‌ను అందిస్తుండడం విశేషం. అలాగే స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.