కమిటీ కుర్రాళ్లకు ఆది స్పీచ్ చెక్ మేట్?


జ‌బర్దస్త్ కమెడియన్ ఆది. రాజ‌కీయంగా అతని భావజాలం అతనిది. ఆ భావజాలానికి అనుకూలమైన పార్టీకి మద్దతు పలకడం, లేదా ప్రచారం చేయడం, గెలిచిన తరువాత కాలర్ ఎగరేయడం, అంత వరకు సమస్య లేదు. కానీ ఇంక జీవితకాలం అదే పనిగా ప్రత్యర్ధిని ట్రోల్ చేయడానికి ప్రయత్నించడం, అవకాశం దొరికిన ప్రతి చోటా అదే పనిగా చౌకబారు విమర్శలు చేయడం అన్నది అతగాడంటే ఇష్టపడే వారిలో కూడా వెగటు పుట్టిస్తుంది.

ఒకసారి సరదా.. రెండు సార్లు సరదా. మరీ అదే పని అయితే వికటించినట్లు అనిపిస్తుంది. పైగా రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకలా వుండవు. 2019లో దారుణంగా ఓడిన పవన్ డిప్యూటీ సిఎమ్ అవుతారని ఎవరూ కలగనలేదు. 2024లో చిత్తుగా ఓడిపోయిన జ‌గన్ అలాగే వుండిపోతాడనీ అనుకోవడానికి లేదు.

జ‌నం ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో, ఎప్పుడు కింద వేస్తారో వారికే తెలియదు. ఆ టైమ్ కు అలా జ‌రిగిపోతుంది. అంతే. చంద్రబాబు లాంటి అనుభవశాలి మూడు సార్లు ప్రతిపక్షంలో కూర్చొవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు సిఎమ్ అయ్యారు. ప్రతిపక్షంలో కూర్చున్నారని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

ఏతా వాతా చెప్పేది ఏమిటంటే రోజులు అన్నీ ఒకేలా వుండవు. ఈ సంగతి కమెడియన్ ఆది గమనించాలి. జ‌బర్దస్త్ స్కిట్ ల్లో జ‌గన్ మీద 11 అంటూ ట్రోలింగ్, శివంభజే లాంటి సినిమాల్లో జ‌గన్ మీద ట్రోలింగ్, నిన్నటికి నిన్న కమిటీ కుర్రాళ్లు సినిమా ఫంక్షన్ లో స్పీచ్ లో ట్రోలింగ్. ఇప్పుడు బాగానే వుంటుంది. సినిమా స్టేజ్ మీద, స్టేజ్ ముందు వున్నవాళ్లంతా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వాళ్లే కాబట్టి ఫక్కున నవ్వేసి వుండొచ్చు ఆది సెటైర్ కు, ట్రోలింగ్ కు.

కానీ రేపు సినిమా విడుదలైన తరువాత చూడాల్సిన వాళ్లు కేవలం జ‌నసేన వాళ్లో, తేదేపా వాళ్లో మాత్రమే వుండరు. వైకాపా వాళ్లు కూడా చూడాలి. నలభై శాతం ఓట్ బ్యాంక్ అన్నది చిన్నది కాదని ఆది గమనించాలి. సినిమా యావరేజ్ గా వుంటే, ఆది ప్రసంగం, ట్రోలింగ్ గుర్తు పెట్టుకుని, వైకాపా సోషల్ మీడియా కనుక కమిటీ కుర్రాళ్లు సినిమాను ఆడేసుకుంటే ఏమవుతుంది? అనవసరంగా నిర్మాత నీహారిక నష్టపోతారు. ఆది బాగానే వుంటారు. స్పీచ్ కు చప్పట్లు అందుకుంటారు.

అందువల్ల ఇకనైనా ఆది కాస్త పరిణితితో మాట్లాడాలి. తన ప్రమేయం వున్న ప్రతి చోటా జ‌గన్ ను ట్రోల్ చేయడం అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆది ని సినిమాల్లోకి తీసుకుంటారు. సినిమా స్టేజ్ లు ఎక్కిస్తారు. అలా సినిమాల్లో జ‌గన్ 11 సీట్ల గురించే పదే పదే ప్రస్తావించినా, స్టేజ్ ల మీద అలాగే మాట్లాడినా, ఆ సినిమాలు అన్నీ వైకాపా సోషల్ మీడియాకు టార్గెట్ అవుతాయి.

అయితే ఏం చేస్తారు.. వాళ్లు ఏం చేయగలరు అని ఎదురు ప్రశ్నిస్తే చెప్పేది ఏమీ వుండదు. ఫలితం కూడా ఎదురు చూడడం తప్ప. ఈ విషయం ఎంత త్వరగా ఆది గమనిస్తే అంత మంచిది.

The post కమిటీ కుర్రాళ్లకు ఆది స్పీచ్ చెక్ మేట్? appeared first on Great Andhra.



Source link

Leave a Comment