స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవం’ టైటిల్ ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ ను ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. కమెడియన్ ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ధనరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం.
తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపాడు. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘విమానం’ చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా దుర్గా ప్రసాద్, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రామం రాఘవం’ తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
కాగా జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్స్ మెగాఫోన్ పట్టి సత్తా చాటుతున్నారు. ఇప్పటికే వేణు ఎల్దండి ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ధనరాజ్ కూడా అదే బాటలో పయనిస్తూ ‘రామం రాఘవం’తో విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.