Nara Lokesh Invited Nasscom : ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేలా కర్ణాటక ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ ఉద్యోగులు పూర్తిగా స్థానికులను నియమించాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై వివాదం చెలరేగింది. ఈ బిల్లు ప్రభావం ఐటీ, ఐటీయేతర సంస్థలపై పడుతుందని నాస్కామ్ ఆందోళన చెందుతుంది. ఈ మేరకు ఆ సంస్థ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే నాస్కామ్ ఆందోళనకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ పరిష్కారం సూచించారు. ఏపీలో ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు విశాఖ అనుకూలమని నాస్కామ్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం పలికారు. నాస్కామ్‌కు అన్ని విధాలుగా సహకరించేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. నాస్కామ్ అసంతృప్తి ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని, ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు అనుకూలమైన వాతావరణ ఉందని నాస్కామ్‌కు తెలిపారు. ఐటీ రంగం విస్తరణకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదించారు. ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చన్నారు. ఐటీ సంస్థలకు కావాల్సిన ఐటీ నిపుణులు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నారు. పెట్టుబడులకు ఏపీలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.