టీడీపీ, జ‌న‌సేన క‌ల‌యిక మూణ్ణాళ్ల ముచ్చ‌టేనా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. చంద్ర‌బాబు అరెస్ట్‌పై క‌న్న కొడుకు లోకేశ్ కంటే ప‌వ‌న్‌క‌ల్యాణే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. తండ్రి అరెస్ట్‌ను నిర‌సిస్తూ లోకేశ్ రోడ్డుపై కూర్చున్నారు. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రోడ్డుపై దొర్లాడినంత ప‌ని చేశారు. అనంత‌రం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుతో ప‌వ‌న్ ములాఖ‌త్ అయ్యారు. ఈ భేటీలో లోకేశ్‌, బాల‌కృష్ణ కూడా పాల్గొన్నారు.
బాబుతో భేటీ త‌ర్వాత బ‌య‌టికొచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు వుంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఒక‌ట్రెండు రోజులు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర‌స్ప‌రం క‌లుసుకున్నారు. బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో టీడీపీ చేప‌ట్టిన దీక్ష‌ల్లో జ‌న‌సేన నేత‌లు కూడా పాల్గొన్నారు. ఈ తంతు ఒక‌ట్రెండు రోజులుగా సాగింది. ఆ త‌ర్వాత రెండు పార్టీల మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ, టీడీపీ దీక్ష‌ల వైపు జ‌న‌సేన క‌న్నెత్తి చూడ‌డం లేదు.
జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా బాబు అరెస్ట్‌పై నోరు తెర‌వ‌డం లేదు. టీడీపీతో పొత్తు ప్ర‌క‌ట‌న త‌ర్వాత అక్టోబ‌ర్ 1న వారాహి యాత్ర వుంటుంద‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై టీడీపీ గుర్రుగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు అరెస్ట్‌కు నిర‌స‌న‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఊరూరా మీటింగ్‌లు పెట్టి తిట్టించాల‌నేది టీడీపీ ప్లాన్‌. అయితే టీడీపీ వ్యూహం ప్ర‌కారం ప‌వ‌న్ న‌డుచుకుంటున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.
చంద్ర‌బాబు అరెస్ట్‌, అనంతర రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్న క్ర‌మంలో త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మౌనంగా వుండ‌డంతో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా వేచి చూసే ధోర‌ణిలో ఉన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిల‌క‌డ లేని నాయ‌కుడ‌ని, ఆయ‌న ఎప్పుడు ఎట్లా వుంటారో తెలియ‌ద‌ని, ఎన్నిక‌ల వ‌ర‌కూ త‌మ‌తో క‌లిసి వుంటార‌ని భావించ‌డం లేద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. మొత్తానికి టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఏదో జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. అది ఏంట‌నేది త్వ‌ర‌లోనే వెలుగు చూసే అవ‌కాశం వుంది.