ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఎందరో సినీ ప్రముఖులు ప్రత్యేక పాత్రల్లో నటించినట్లు ఎప్పటినుంచో వార్తలొచ్చాయి. ఎవరెవరు ఏయే రోల్ లో నటించారో తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పాత్రకి సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి తెరపడింది.
‘కల్కి 2898 AD’లో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ తో విజయ్ కి మంచి అనుబంధం ఉంది. సినిమాల్లో ప్రయత్నించే టైం నుంచే ఇద్దరు మంచి స్నేహితులు. హీరోగా, డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత కూడా.. ఇద్దరి మధ్య అదే స్నేహం కొనసాగుతుంది. తాను చేసే ప్రతి సినిమాలో విజయ్ ఉండేలా చూసుకుంటానని ఒక సందర్భంలో నాగ్ అశ్విన్ చెప్పాడు. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో కథకి కీలకమైన రిషి పాత్రలో విజయ్ నటించాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన రెండో సినిమా ‘మహానటి’లోనూ విజయ్ కీ రోల్ చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘కల్కి’లో అర్జునుడి పాత్రలో విజయ్ నటించడం విశేషం. మహాభారతంలో అర్జునుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంతటి భారీ సినిమాలో, అంతటి గొప్ప పాత్ర విజయ్ కి దక్కడం అదృష్టమని చెప్పవచ్చు. ఇక ఆ పాత్రకి విజయ్ పూర్తి న్యాయం చేశాడు. అర్జునుడిగా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మెప్పించింది. విజయ్ తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన ఈ అర్జునుడి పాత్ర.. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.