“థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం. ఈ వారం ప్రేక్షకులకు అభినందనలు చెబుతున్నాం. కల్కి సినిమాను వంద రూపాయలకే ఎంజాయ్ చేయండి. ఆగస్ట్ 2 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా.”
ఇలా కల్కి టికెట్ రేట్లను తగ్గించినట్టు ఘనంగా ప్రకటించింది యూనిట్. దీంతో మరోసారి కల్కి సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయొచ్చని చాలామంది సంబరపడ్డారు. కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూసిన జనాలకు ఆ ఆనందం నిమిషాల్లో ఆవిరైంది.
హైదరాబాద్ విషయానికొస్తే.. దాదాపు 80 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో కల్కి టికెట్ రేట్లలో తగ్గుదల కనిపించలేదు. మరీ వంద రూపాయలకు టికెట్ ఏంటని భావించారేమో కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్ రేటును 250 చేశారు, మరికొన్నింటిలో 150, ఇంకొన్నింటిలో 110 చేశారు.
అంతే తప్ప, ఏ మల్టీప్లెక్సులో వంద రూపాయల టికెట్ రేటు కనిపించలేదు. ఏషియన్ ఛెయిన్ లో సింగిల్ స్క్రీన్స్ లో చెప్పినట్టుగానే వంద రూపాయలు చేశారు. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కొన్నింటిలో 250 రూపాయలు టికెట్ కనిపించగా, మరికొన్నింటిలో మాత్రం 110 రూపాయలు కనిపించింది. పీవీఆర్ ఛెయిన్ లో కూడా ఇదే పరిస్థితి.
సినీపొలిస్ కూడా ఇదే దారిలో పయనించగా.. ఐనాక్స్ లో మాత్రం కేవలం ఒకే ఒక్క స్క్రీన్ లో 110 రూపాయల టికెట్ కనిపించింది. మిగతా అన్ని స్క్రీన్స్ లో గరిష్ఠంగా 350 రూపాయలే ఉంచారు. ఇక ఏఎంబీలో రీక్లయినర్స్ మినహా మిగతావన్నీ ఫ్లాట్ 150 చేశారు.
ఇక ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కూడా టికెట్ రేట్లు తగ్గలేదు. కల్కి సినిమాకు ఫ్లాట్ 200 రూపాయలు వసూలు చేస్తున్నారక్కడ. ఉన్నంతలో సింగిల్ స్క్రీన్స్ బెటర్. దాదాపు అన్ని సింగిల్ స్క్రీన్స్ లో ఫ్లాట్ 100 రూపాయలు, అంతకంటే కాస్త తక్కువకే టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. నైజాంలోని ఇతర ప్రాంతాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొన్ని స్క్రీన్స్ మినహా, టికెట్ రేట్లు వందకు దిగాయి.
సో.. కల్కి సినిమాను వంద రూపాయల్లోనే చూడాలనుకుంటే ముందుగా థియేటర్లలో టికెట్ రేట్లను చెక్ చేసి వెళ్లండి. ‘ఇండియా అంతా వంద’ అని మేకర్స్ చెప్పారని ఏఎంబీ లాంటి మాల్స్ కు వెళ్తే అంతే సంగతులు. వంద రూపాయలకే టికెట్ అంటూనే, నిబంధనలు-షరతులు వర్తిస్తాయని కూడా చెప్పారు మేకర్స్.
The post కల్కి టికెట్ రేట్లు.. ప్రకటనకే పరిమితమా? appeared first on Great Andhra.