ఇటీవల కాలంలో పలు పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇదే బాటలో మే 9న విడుదల కావాల్సిన ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD) కూడా వాయిదా పడుతుందని ఇటీవల వార్తలొచ్చాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ తో ముడిపడి ఉన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు, ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి ఉండటంతో.. కల్కి మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలను దాదాపు అందరూ నమ్మారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదట. చెప్పిన తేదీకే కల్కి రాబోతుందట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చేలా ఉంది.
ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 AD’. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ వార్త.. సర్ ప్రైజింగ్ గా ఉంది. ‘కల్కి 2898 AD’ పార్ట్-1 షూటింగ్ ఎప్పుడో పూర్తయిందట. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఇతర పనులు జరుగుతున్నాయట. ఏప్రిల్ నాటికి పార్ట్-1 కి సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు కొంతకాలంగా జరుగుతున్న షూటింగ్ కూడా పార్ట్-2 కి సంబంధించినదని సమాచారం. ఇప్పటిదాకా మే 9న కల్కి విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవ్వగా.. ఇప్పుడు పార్ట్-1 ఎప్పుడో పూర్తయ్యి, ప్రస్తుతం పార్ట్-2 షూట్ జరుగుతుందనే వార్త ఆసక్తికరంగా మారింది.
‘కల్కి’ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, రానా దగ్గుబాటి, రాజమౌళి తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.