కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో అంతా తారుమారు
ఈసారి ఎన్నికల్లో తనకే టికెట్ అన్న విశ్వాసంలో ఉన్న చలమల్లకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం షాకిచ్చింది. వాస్తవానికి ఈ సారి మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఉపఎన్నికల అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి, చలమల్ల క్రిష్ణారెడ్డి, బీసీ నాయకుడు పున్న కైలాస్ నేత ప్రయత్నించారు. చలమల్లకు దాదాపు టికెట్ వచ్చే పరిస్థితి ఉందన్న ప్రచారం కూడా జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దగ్గరి అనుచరుడు కావడం, గత ఏడాది ఉప ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి చలమల్లకు హామీ ఇవ్వడంతో ఇక టికెట్ ఆయనదే అని అనుకున్నారంతా. కానీ, ఈలోగా బీజేపీకి ఝలక్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీలో చేరిన మరునాటి ఉదయమే ఆయనకు ఏఐసీసీ నాయకత్వం మునుగోడు టికెట్ ను ప్రకటించింది. తనకు అన్యాయం చేశారని, తనకే టికెట్ ఇవ్వాలని చలమల్ల మొత్తుకున్నా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. తన అనుచరులు, అనుయాయులతో సమావేశం అయ్యాక చలమల్ల క్రిష్ణారెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ సరైన అభ్యర్థి కోసం బీజేపీ కూడా వెదులాటలో ఉండగా, చలమల్ల క్రిష్ణారెడ్డి రూపంలో వారి కాళ్లకు ఓ తీగ తగిలింది.