కన్నడ చిత్రం ‘కాంతార’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. 2022 సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ సినిమాకి విశేష ఆదరణ లభించింది. పాన్ ఇండియా మాయలో పడి అనవసరమైన హంగులు ఆర్భాటాల జోలికి పోకుండా.. తన ప్రాంత మట్టి కథని అద్భుతంగా తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. భూతకోల అనే తమ ఆచారాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అలా మట్టి నుంచి పుట్టిన కథ కాబట్టే.. భాషతో సంబంధం లేకుండా ఎందరికో చేరువైంది కాంతార. అయితే ఇప్పుడు తెలుగులో ఈ తరహా సినిమా చేయడానికి నేచురల్ స్టార్ నాని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కథల ఎంపికలో నాని ఎప్పుడూ వైవిధ్యం చూపిస్తుంటాడు. అలాగే తన సహజ నటనతో ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించగలుగుతాడు. అందుకే నానితో విభిన్న సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం దర్శకుడు వేణు ఎల్దండి అదే పనిలో ఉన్నాడట. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందాడు. చావు చుట్టూ కథని అల్లుకొని.. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో బంధం విలువని తెలియజేసి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. మొదటి సినిమాతోనే అంతలా మ్యాజిక్ చేసిన వేణు.. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ను నానితో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ కథ డివోషనల్ టచ్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. గ్రామ దేవత చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అందుకే ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. ఈ కథ విని.. నాని ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడట. ఈ కథని కరెక్ట్ గా తెరపైకి తీసుకొస్తే తెలుగు ‘కాంతార’గా పేరు తెచ్చుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.