దిశ, ఫీచర్స్ : పచ్చి మిరపకాయలను ఆహారంలో ఉపయోగించకపోతే అస్సలు రుచిగా ఉండదు. భారతీయ వంటలలో దాదాపుగా ప్రతి వంటకానికి పచ్చి మిరపకాయలు వాడాల్సిందే. కొంతమంది పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మరికొందరు తక్కువ కారంగా తినడానికి ఇష్టపడతారు. అయితే రుచిని పెంచే ఈ మిరపకాయ మీ గుండెకు చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయలు తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. పచ్చిమిర్చి తినడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ తెలిపారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడం మొదలుకుని అనేక అనారోగ్య సమస్యలకు మిర్చి చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ కారంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. మిర్చిపై ఇటీవలి పరిశోధనలు చేసిన తర్వాత మిరపకాయ గుండెపోటు లేదా స్ట్రోక్‌తో మరణించే అవకాశాలను తగ్గిస్తుందని వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు.
పరిశోధనలో ఏం తేలింది..
వారంలో కనీసం నాలుగు సార్లు మిరపకాయ తింటే గుండె సంబంధిత వ్యాధితో మరణించే అవకాశాలు 44 శాతం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే స్ట్రోక్ నుండి మరణించే అవకాశాలు 61 శాతం తగ్గుతాయని చెబుతున్నారు. ఇటువంటి అధ్యయనాలు కేవలం పరిశీలనాత్మకమైనవని తెలుసుకోవడం ముఖ్యం అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి బూస్టర్
తాజా, ఎండు మిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు వైద్యనిపుణులు.