ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి లబ్ధిదారులకు ఆర్థిక చేయూతనిచ్చింది. తమకు అధికారం ఇస్తే, జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తామని తల్లులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అందరికీ తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు చొప్పున ప్రతి ఏడాది ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు చెబితే, మాటపై నిలబడకుండా ఉంటారా? అనే ఆలోచనతో కూటమికి తల్లులు అండగా నిలిచారు.
కూటమికి అపరిమితమైన అధికారం దక్కడానికి సూపర్ సిక్స్ హామీలు ప్రధాన కారణం. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయానికే వేసవి సెలవులు ముగిసి, విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. తల్లికి వందనం పథకం కింద ఎంతెంత లబ్ధి కలుగుతుందో అనే లెక్కలు తల్లులు వేయడం మొదలు పెట్టారు. ప్రతి కుటుంబంలో ఇద్దరు పిల్లలకు తక్కువ లేరు. దీంతో రూ.30 వేలకు తక్కువ కాకుండా చంద్రబాబు ప్రభుత్వం తమ ఖాతాల్లో డబ్బు జమ చేస్తుందని ఆశించారు.
తల్లికి వందనానికి సంబంధించి ప్రకటన ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తున్న తల్లులు, పిల్లలకు లోకేశ్ షాక్ ఇచ్చారు. హామీకి కట్టుబడి వుంటామని చెబుతూనే, పథకం అమలుకు అధ్యయనం చేస్తున్నామని, మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అందరికీ పథకం అమలు చేస్తామని చెబుతున్నప్పుడు, కొత్తగా గైడ్లైన్స్ తీసుకురావడం ఎందుకనే చర్చకు తెరలేచింది.
మార్గదర్శకాలు తీసుకొచ్చేందుకు ఏడాది సమయం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇదంతా కాలయాపన కోసమే అనే విమర్శ వెల్లువెత్తుతోంది. అయితే ప్రతి విద్యార్థికి పథకం అమలు చేస్తామని లోకేశ్ చెప్పడం సంతోషించదగ్గ విషయమని అంటున్నారు.
The post కాలయాపనకేనా లోకేశ్? appeared first on Great Andhra.